టార్గెట్‌ ‘లాల్‌ ఖిలా’... మమత సరికొత్త నినాదం!

Mamata Targets Lal Qila, calls for Chalo Delhi - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ ‘చలో ఢిల్లీ’  అంటూ పిలుపునిచ్చారు. ఇక తమ లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే అని ప్రకటించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఇక తమ లక్ష్యం బెంగాల్‌ అంటూ బీజేపీ నినాదానికి ప్రతిగా ‘టార్గెట్‌ లాల్‌ ఖిలా’ పోరుకేకను ఆమె అందుకున్నారు.

త్రిపురలో పాతికేళ్ల సీపీఎం పాలనకు బీజేపీ తెరదించిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ.. బెంగాల్‌, ఒడిశా, కేరళలో విజయాలు సాధిస్తేనే.. కమలానికి సంపూర్ణ స్వర్ణయుగం వచ్చినట్టు అని పేర్కొన్నారు. అయితే, అమిత్‌ షా వ్యాఖ్యలపై మమత ఘటుగా స్పందించారు. సోమవారం పురాలియా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇక తమ తదుపరి టార్గెట్‌ బెంగాలేనని కొందరు అంటున్నారు. అలాగైతే మన లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే. ఢిల్లీ దిశగా సాగుదాం. ఛలో ఢిల్లీ అంటూ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన నినాదాన్ని మేం నమ్ముతాం. బెంగాల్‌ దేశాన్నే కాదు భవిష్యత్తులో ప్రపంచాన్ని గెలుచుకోగలదు’ అని ఆమె పేర్కొన్నారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ‘థర్డ్‌ ప్రంట్‌’ ప్రకటనపై మమతా బెనర్జీ చురుగ్గా స్పందించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు ఆమె ఫోన్‌ చేసి.. మద్దతు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమి ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. గతంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుచేసేందుకు మమత ఉత్సాహం చూపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top