రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు

Mamata insulting Constitution by not accepting me as PM - Sakshi

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ధ్వజం

పశ్చిమబెంగాల్, యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ

బంకురా/పురూలియా/అజాంగఢ్‌/అలహాబాద్‌: ప్రధానిగా తనను అంగీకరించబోనని చెప్పడం ద్వారా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రధానిగా గుర్తించని మమత.. ఇమ్రాన్‌ ఖాన్‌ను పాక్‌ ప్రధానిగా గుర్తించడాన్ని గౌరవంగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే మమత భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని స్పష్టం చేశారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ, మమతా బెనర్జీతో పాటు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

మీ చెంపదెబ్బలే నాకు దీవెనలు..
మమతా బెనర్జీ వాడుతున్న భాషను చూస్తేనే ఆమె ఎంత ఆందోళనలో ఉన్నారో అర్థమవుతుందని మోదీ తెలిపారు. ‘మమతా దీదీ నన్ను చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నట్లు విన్నాను. నేను మిమ్మల్ని(మమత) అమితంగా గౌరవిస్తున్నా. దీదీ(అక్కా) అని పిలుస్తున్నా. కాబట్టి మీరు కొట్టే చెంపదెబ్బలు నాకు దీవెనల వంటివి. మమతా బెనర్జీకి నిజంగా ధైర్యముంటే ముందుగా బెంగాల్‌లో చిట్‌ఫంట్‌ నిర్వాహకులు, ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడే వారి చెంపలు వాయించాలి. అప్పుడే టీఎంసీ అంటే తృణమూల్‌ దోపిడీదారుల(టోలాబాజ్‌) పన్ను అనే అపప్రద తొలగిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ చెంపదెబ్బలతో పాటు తనను రాళ్లతో కొట్టడం గురించి మాట్లాడుతున్నారని మోదీ విమర్శించారు. ప్రతిపక్షాల దూషణలు తనకు అలవాటు అయిపోయాయనీ, ప్రపంచంలోని డిక్షనరీలన్నింటిలో ఉన్న తిట్లను కూడా అరిగించుకునే శక్తి వచ్చిందని చెప్పారు.

‘ఉపాధి’ కూలీలనూ వదిలిపెట్టలేదు..
పశ్చిమబెంగాల్‌లో పేరుకే టీఎంసీ ప్రభుత్వం నడుస్తోందనీ, అసలు వ్యవహారాలన్నింటిని తెరవెనుక సిండికేట్‌ నడిపిస్తోందని మోదీ ఆరోపించారు. ‘ఈ దోపిడీదారుల కారణంగా రాష్ట్రంలోని టీచర్ల నుంచి మేధావుల వరకూ, వ్యాపారుల నుంచి నిరుపేదల వరకూ అందరూ వేధింపులు ఎదుర్కొంటున్నారు. వీరు చివరికి జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) కూలీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఈ కార్మికుల జాబ్‌కార్డులను కూడా లాక్కుంటున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందించేందుకు కేంద్రం భారీగా నిధులను అందజేస్తుంటే వాటిని కూడా ఈ దోపిడీదారులు లూటీ చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత తన అధికార దాహంతో పశ్చిమబెంగాల్‌ను సర్వనాశనం చేశారనీ, ఇప్పుడు అధికారాన్ని కోల్పోతానన్న భయంతో మరింత నష్టం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు.

కిచిడీ కూటమికి ఓటేస్తే అంతే..
విపక్షాలు ఏర్పాటుచేసిన మహాకూటమికి ఓటేస్తే దేశభద్రత ప్రమాదంలో పడుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ కిచిడీ కూటమికి ఓటేస్తే దేశంలో అరాచకత్వం, అస్థిరత నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బీజేపీ అధికారంలోని రాకముందు ఉగ్రదాడులు అనగానే అజాంగఢ్‌(యూపీ) పేరు వినిపించేది. ఎందుకంటే ఉగ్రమూకలకు సాయంచేసే వ్యక్తులకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) నేతల ఆశీస్సులు ఉండేవి. వీరు అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి కులం, మతం, జాతి వంటి అంశాలను పరిశీలించేవారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉగ్రవాదాన్ని జమ్మూకశ్మీర్, సరిహద్దులోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగాం. ఈ సరికొత్త భారతం ఉగ్రవాదులను వారి ఇళ్లలో దూరి హతమారుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

కాళీమాతకు భయపడండి
టీఎంసీ నేతల అకృత్యాలపై తాను మాట్లాడితే మమతా బెనర్జీకి కోపం వస్తోందని మోదీ అన్నారు. కానీ తాను ఈ కోపానికి భయపడబోననీ, ఎందుకంటే 130 కోట్ల మంది భారతీయుల ప్రేమ తనతో ఉందని వ్యాఖ్యానించారు. ‘పశ్చిమబెంగాల్‌లో చిట్‌ఫండ్‌ మోసాల కారణంగా సర్వస్వం కోల్పోయిన పేదలు, నిరుద్యోగ యువకులు ఆగ్రహించడంపై మమత భయపడాలి. దుర్గామాత భక్తులు పూజ చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల కాళీమాత ఆగ్రహిస్తుందని మమత భయపడాలి. టీఎంసీ నేతలు ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనుల ద్వారా యథేచ్ఛగా సంపాదిస్తున్నారు. కానీ కార్మికులకు మాత్రం కనీస వేతనం చెల్లించడం లేదు’ అని ప్రధాని విమర్శించారు. ఓవైపు మమత తన మేనల్లుడి రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు మంత్రులు, టీఎంసీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారనీ, ఆ పార్టీ కార్యకర్తలు బలవంతపు వసూళ్లకు దిగుతున్నారన్నారు. ఫొని తుపాను సందర్భంగా తాను ఫోన్‌చేసినప్పటికీ మమత స్పందించలేదన్నారు. మే 23తో బెంగాల్‌లో మమత పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top