కాంగ్రెస్‌తో విభేదాలు లేవు : మమత

Mamata Benarjee Clarity on Rift with Congress Party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీతో తనకెలాంటి విభేదాలు లేవని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో ఆమె భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మమత మాట్లాడారు. 

‘కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో నాకెలాంటి సమస్యలు లేవు. ఆయన్ని త్వరలోనే కలుస్తా. సోనియాగాంధీ ఆరోగ్యం బాగుపడగానే వెళ్లి వాళ్లతో మాట్లాడ్తా’ అని మమతా పేర్కొన్నారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగడతామని థర్డ్‌ ఫ్రంట్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని మించిన మతతత్వ పార్టీ లేదని.. మోదీ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బీజేపీకి మరోసారి అధికారం దక్కనివ్వకూడదంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 

యూపీలో అఖిలేశ్‌-మాయావతిలు ఏకం కావాలని ఆమె కోరారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని మమత జోస్యం చెప్పారు. ఇక ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఆమె నేడు శరద్‌ పవార్‌, శివసేన, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో భేటీ అయ్యారు. రేపు కూడా ఆమె పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ నేతలు యశ్వంత్‌ సిన్హా, శతృఘ్న సిన్హాలను కూడా ఆమె కలవబోతుండటం విశేషం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top