41 శాతం సీట్లు మహిళలకు కేటాయించిన టీఎంసీ

Mamata Banerjee Says Her Party Have 41 Per Cent Women Candidates For Lok Sabha Poll - Sakshi

కోల్‌కతా : 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరపున 41 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ‘మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అన్ని రాజకీయ పార్టీలకు సవాల్‌ విసురుతున్నాను. మా పార్టీ నుంచి ఈసారి మహిళలు అత్యధిక సంఖ్యలో పోటీ చేస్తున్నారు. ఈ విషయం మాకెంతో గర్వకారణం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ నుంచి ముగ్గురు బెంగాలీ నటీమణులు  పోటీ చేయనున్నారని మమత తెలిపారు. నుస్రత్‌ జహాన్‌, మిమీ చక్రబర్తి, మున్‌ మున్‌ సేన్‌లకు టికెట్‌ ఖరారు చేసినట్లు ఆమె ప్రకటించారు.

అసనోల్‌ నియోజక వర్గం నుంచి కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోకు పోటీగా మున్‌ మున్‌ సేన్‌ బరిలోకి దిగుతారని మమత పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఎంసీలో చేరిన మౌసమ్‌ నూర్‌ మల్దా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ఇటీవల దారుణంగా హత్యకు గురైన టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిస్వాస్‌ భార్య రుపాలీ బిస్వాస్ కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతారని మమత పేర్కొన్నారు. ఇక మిడ్నాపూర్‌ ఎంపీ సంధ్యా రాయ్‌, ఇద్రిస్‌ అలీ, ఉమా సోరెన్‌ తదితరులు ఈ ఎన్నికల్లో పోటీ చేయరని ఆమె స్పష్టం చేశారు. అదే విధంగా ఒడిషా, అసోం, జార్ఖండ్‌, అండమాన్‌ నికోబార్‌లతో తమ పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతారని ఆమె తెలిపారు.

చదవండి : బెంగాల్‌ పోల్‌ షెడ్యూల్‌పై వివాదం

కాగా ఇక తమ పార్టీ నుంచి 33 శాతం టికెట్లను మహిళలకు కేటాయిస్తామంటూ బిజూ దళ్‌ చీఫ్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో మమత 41 శాతం సీట్లు మహిళలకు కేటాయించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను ఏడు విడతలకు విస్తరించడం, రంజాన్‌ మాసం సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం వెనక కుట్ర ఉందని మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top