కూటమిని ఒక్కటిగా చూడాలి

mahakutami leaders meet governor esl narasimhan - Sakshi

ప్రభుత్వ ఏర్పాటులో ఫ్రంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి

గవర్నర్‌కు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతల విజ్ఞప్తి

ప్రజాఫ్రంట్‌ ఏర్పాటు, సీఎంపీ తీర్మానాల ప్రతి అందజేత

ముందు జాగ్రత్తగానే గవర్నర్‌ను కలిశాం: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న (హంగ్‌) అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కూడిన ప్రజాకూటమి నేతలంతా సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిశారు. ఎన్నికలకు ముందే తాము ప్రజాకూటమి (పీపుల్స్‌ ఫ్రంట్‌)గా ఏర్పడినందున కూటమిపక్షాలను ఒకే జట్టుగా చూడాలని విన్నవించారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి వస్తే తమ నాలుగు పార్టీలకు కలిపి వచ్చే సీట్లను ఒకే పక్షానికి వచ్చినట్లుగా పరిగణించి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, టీజేఎస్‌ అధినేత కోదండరాం, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ గౌడ్, అజహరుద్దీన్, సంపత్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టీడీపీ సీనియర్లు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మండవ వెంకటేశ్వర్‌రావులతోపాటు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు గవర్నర్‌ను కలిశారు. ఎన్నికలకు ముందే ప్రజాఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించిన లేఖను అందజేశారు.

‘ఎన్నికలకు ముందే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడ్డాయన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. డిసెంబర్‌ 7న జరిగిన ఎన్నికల్లో నాలుగు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. దీంతోపాటే కామన్‌ ఎజెండాను ఈసీకి సమర్పించిన కాపీని మీ దృష్టికి తెస్తున్నాం. ఎన్నికల్లో గెలిస్తే కూటమి సంయుక్తంగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది.. కలసి పనిచేస్తుంది. ఈ అంశాన్ని మీ పరిశీలన, సమాచారం నిమిత్తం తెలియజేస్తున్నాం’ అని లేఖలో నేతలు పేర్కొన్నారు. లేఖతోపాటు ప్రజాకూటమి ఏర్పాటు, కామన్‌ మినిమం ప్రోగ్రాం, కొత్త ప్రభుత్వంలో ఫ్రంట్‌లోని పక్షాలకు న్యాయమైన భాగస్వామ్యం వంటి అంశాలపై గతంలో పార్టీలు చేసిన తీర్మాన కాపీలను గవర్నర్‌కు అందజేశారు.

80 సీట్లు మావే: ఉత్తమ్‌
గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ కూటమికి 80 స్థానాలు దక్కే అవకాశం ఉందని, అయినా ముందు జాగ్ర త్త చర్యల్లో భాగంగానే నరసింహన్‌ను కలిశామని స్పష్టం చేశారు. ‘ఎన్నికల ఫలితాలు మ్యాజిక్‌ ఫిగర్‌కి దగ్గరగా ఉన్నప్పుడు ఏ పార్టీని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డ కూటమిని ఒక్కటిగా చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఎన్నికలకు ముందే జట్టుగా కలసి పోటీ చేశాయి. ఆ డాక్యుమెంట్, కామన్‌ ఎజెం డాను గవర్నర్‌కు అందజేశాం. పెద్ద పార్టీని ప్రభు త్వ ఏర్పాటుకు పిలవాల్సి వస్తే కూటమికి వచ్చే సీట్లను ఒకే పక్షానికి వచ్చినట్లుగా పరిగణించాలని చెప్పాం’ అని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని పార్టీలు ఇతర పార్టీలతో కలిసే అవకాశం ఉందని, అయితే ఎన్నికలకు ముందు కలిసిన పార్టీలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కోరామన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top