వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో 29న మహాధర్నా

Maha Dharna On 29 Under the YSRCP - Sakshi

డిగ్రీ కళాశాలకు గదులు కేటాయించాలి

సమయం మించిపోతున్నా సాగని చదువులు

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మలి బాల్‌రాజ్‌

కొడంగల్‌ రూరల్‌ : డిగ్రీ కళాశాలకు గదులు కేటాయించాలంటూ ఈ నెల 29వ తేదీన మండల కేంద్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మలి బాల్‌రాజ్‌ పిలుపునిచ్చారు. ఇటీవల ఆగస్టు 11వ తేదీన డిగ్రీ విద్యార్థులకు తరగతుల నిర్వహణ కొరకు గదులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని నిరసన తెలపడానికి సన్నద్ధం కావడంతో సీఐ హామీ మేరకు నిరసనను విరమించామని ఆయన అన్నారు. సమయం గడిచిపోతున్నా డిగ్రీ విద్యార్థుల చదువులు సాగకపోవడంతో ఇబ్బందిగా మారిందని అన్నారు.

ఈ విషయంపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్‌ జిల్లాల పార్టీల అధ్యక్షులు మరియమ్మ, కోళ్ల యాదయ్యల ఆధ్వర్యంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్టిలో ఉంచుకొని ఈ నెల 29వ తేదీన మండల కేంద్రంలో మహాధర్నాను నిర్వహించడానికి వారు అంగీకారం తెలిపారని తమ్మలి బాల్‌రాజ్‌ తెలిపారు. గత పదేళ్లుగా డిగ్రీ, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు జూనియర్‌ కళాశాల భవనంలో వంతుల మాదిరి ఉదయం, మధ్యాహ్నం తరగతులను నిర్వహిస్తుండగా, ఈ ఏడాది మాత్రమే డిగ్రీ విద్యార్థులకు గదులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

నూతనంగా నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల భవనం త్వరితగతిన పూర్తి చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత కాంట్రాక్టర్‌ జాప్యం చేస్తుండడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. గతంలో మాదిరిగానే తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో 29వ తేదీన మహాధర్నాను కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. మహాధర్నాకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కారమయ్యేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top