అప్పులు తప్ప ఒరిగిందేమీ లేదు

Kuntiya Fires On KCR Governance - Sakshi

కేసీఆర్‌ పాలనపై కుంతియా ధ్వజం

గజ్వేల్‌: కేసీఆర్‌ పాలనలో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల అప్పులు తప్ప ఒరిగిందేమీ లేదని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్‌ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదల సమస్యలను గాలికొదిలేసి కేసీఆర్, ఆయన కుటుంబీకులు మాత్రం ఫలితాలను అనుభవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికలను హడావుడిగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రిజర్వేషన్ల ప్రకటన తర్వాత నోటిఫికేషన్‌కు సమయం ఇవ్వాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు.

రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ను మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడించి ఇక్కడి ప్రజలు రాష్ట్రానికి మేలు చేయాలని పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌ ఓడితే అప్పుడైనా ఆ పార్టీ నేతల్లో కనువిప్పు కలుగుతుందన్నారు. సీఎం ఇటీవల ప్రారంభించిన ఆడిటోరియానికి గతంలో పగుళ్లు ఏర్పడగా.. రంగులేసి ప్రారంభోత్సవం చేశారని పేర్కొన్నారు. ఇక్కడే పరిస్థితే ఇలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని విమర్శించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, జిల్లా మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top