జీ హుజూరా? గులాబీ జెండానా?

KTR Slams Uttam Kumar Reddy At Roadshow In Huzurnagar - Sakshi

ఈ ప్రాంతం వెనుకబాటుకు ఉత్తమ్‌కుమారే కారణం

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి

రోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘ఈరోజు హుజూర్‌నగర్‌ ప్రజల ముందు స్పష్టమైన అవకాశం.. మార్గం ఉంది. ప్రత్యామ్నాయం ఉంది. మళ్లీ వాళ్లకే ఓటేసి జీ హుజూర్‌ అందామా.. లేదా గులాబీ జెండాను గుండెకు హత్తుకొని జై హుజూర్‌నగర్‌ అందామా? ఏ విషయం ఆలోచించుకోవాలి’అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన రోడ్‌ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.  

ఉత్తమ్‌ మోసకారి..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన ఉత్తమ్, అప్పుడు సీఎంని అవుతానంటూ ఓట్లు వేయించుకున్నారని, మళ్లీ 2019లో కేంద్ర మంత్రిని అవుతానని చెప్పి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, ప్రజలను ఇలా మభ్య పెట్టిన ఉత్తమ్‌ మోసకారి అని కేటీఆర్‌ విమర్శించారు. 

రూ.2 వేల కోట్లు ఇచ్చాం..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మొత్తం రూ.2 వేల కోట్లపైచిలుకు వివిధ కార్యక్రమాల ద్వారా హుజూర్‌నగర్‌ ప్రజలకు అందించినట్లు కేటీఆర్‌ చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ తట్ట, పార పారేసి ఎప్పుడో చెక్కేశారన్నారు. ఆయన దేశంలోనే లేడన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు.. పేరుకే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని, ఆయన వెనక 12 మంది ‘నేను సీఎం, నేను సీఎం’ అంటూ ఎన్నికలు కాకముందే అన్నారన్నారు.

అందులో నల్లగొండలో నలుగురు ఉన్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఎలాగైనా సైదిరెడ్డిని ఓడించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటేస్తే సంక్షేమం, పల్లెపల్లెలో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తనదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రోడ్‌షోలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా సీపీఐ నాయకులు పాల్గొన్నారు.  

ఏనాడూ ప్రజలకోసం అడగలేదు..
గతంలో ఉత్తమ్‌ ఎమ్మెల్యేగా ఉన్నా .. ఐదేళ్లలో ఏనాడూ మా ప్రజలకు ఇది కావాలంటూ ఒక్క దరఖాస్తు కూడా చేయలేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ‘నేను సీఎం స్థాయి వ్యక్తిని నేను వెళ్లి, జగదీశ్, కేటీఆర్‌ను అడుగుతానా..?’అన్న అహంకారం ఉత్తమ్‌కు ఉందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top