‘భరత్‌ బహిరంగ సభ’కు పొగ రాలేదా?

Kodandaram Slams TS Govt For Denying Permission To TJS Meeting - Sakshi

టీజేఎస్‌ ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణపై కోదండరాం ఫైర్‌

హైకోర్టులో పిటిషన్‌ వేసిన రచనా రెడ్డి

సాక్షి, వికారాబాద్‌: కొత్తగా ఏర్పడిన తెలంగాణ జన సమితి పార్టీ(టీజేఎస్‌) ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. నగరం నడిబొడ్డున సభలు జరిపితే, అక్కడికి వచ్చే వాహనాల పొగ వల్ల కాలుష్యం పెరుగుతుందని, పైగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే అనుమతివ్వడంలేదని పోలీసులు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘మేం సభ పెడతామంటే వద్దన్నారు. అదే మొన్న ‘భరత్‌ అనే నేను’ సినిమాకు ఎల్బీ స్టేడియంలో అనుమతి ఇచ్చారు. ఆ సభకు వాహనాలు రాలేదా? ఆ వాహనాల నుంచి పొగ రాలేదా?’’ అని కోదండరాం ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో సభ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు సన్నాకంగా వికారాబాద్ సత్యభారతి గార్డన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కోదండరాం మాట్లాడారు. ‘‘నాయకులు మాట్లాడకుంటే ప్రజలకు న్యాయం జరగదు. కానీ ఆ నాయకులే అమ్ముడు పోతున్నరు. సమస్యల పరిష్కారాల కోసం నాలుగేళ్లుగా కొట్లాడుతున్నాం. ఆ ఉద్యమ స్ఫూర్తి నుంచి పుట్టిందే తెలంగాణ జనసమితి పార్టీ. ఎవరో వెనుక ఉండి చెబితే పెట్టిన పార్టీకాదిది. తెలంగాణ వచ్చి నాలుగేళ్లైనా వికారాబాద్ జిల్లాకు సాగునీటి జాడలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అబద్ధాలు చెబితే ఇగ ఏం చెప్పాలె!’ అని కోదండరాం అన్నారు.

హైకోర్టులో రచనా రెడ్డి పిటిషన్‌
ఈ నెల 29న తలపెట్టిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కాలుష్యం సాకుతో అనుమతి నిరాకరించడాన్ని సవాలుచేస్తూ ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఎల్బీ స్టేడియం, సరూర్‌ నగర్‌ స్టేడియం, ఎన్డీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏదో ఒక చోట సభ నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను సోమవారానికి వాయిదావేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top