ఉద్యమ ఆకాంక్షలే కూల్చుతయ్‌

Kodandaram comments on KCR - Sakshi

     డబ్బు, మద్యంతో గెలవాలని చూస్తున్న కేసీఆర్‌ 

     మీడియా చిట్‌చాట్‌లో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రచార సరళిలో నూతన రూపం వచ్చిందని, కొత్త రకం రాజకీయం చేస్తే తప్ప టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం టీజేఎస్‌ కార్యాలయంలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి నిర్మాణం లేదు.. పాడు లేదు.. ఉద్యమ ఆకాంక్షలే నాడు గెలిపించాయన్నారు. ఆ ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకుపోతేనే కూటమికి భవిష్యత్తు ఉంటుందన్నారు. గెలిచిన తరువాత టీఆర్‌ఎస్‌ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేదని, అందుకే అవే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చుతాయన్నారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బు సంపాదించి, వాటిని ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు గెలవాలని చూస్తున్నారన్నారు. డబ్బు, మద్యం ద్వారా అధికార పార్టీ ముందుకు సాగుతుందని, అందులో తాము వెనుకేనన్నారు. వాటితో గెలవడం కష్టమని, తమ ఎజెండానే తమను గెలిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

అజెండాను వివరిస్తూ ప్రజల వద్దకు వెళ్తామని, అందుకు సమయం కావాలన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారంతోనే గెలిచిందన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ కూడా స్వీకరించాలన్నారు. పాత విధానంలో పోతే నష్టమేనని, ప్రచార విధానం మార్చాలని అభిప్రాయపడ్డారు. టీజేఎస్‌ అభ్యర్థుల ప్రచారం విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం పరిస్థితులు, పరిణామాలు ఏం బాగా లేవన్నారు. కాంగ్రెస్‌ జాప్యంతో ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్న వాళ్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని, తమ పార్టీ అభ్యర్థులకు శనివారం బీ–ఫారాలు అందజేస్తామన్నారు.

మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ తమకు కేటాయించిన 8 సీట్లలో ఇప్పటి వరకు 6 సీట్లకే స్పష్టత వచ్చిందన్నారు. ఒకట్రెండు నియోజకవర్గాల్లో కూటమి పార్టీలతో స్నేహపూర్వక పోటీ ఉండొచ్చన్నారు. జనగామ సీటు విషయం ఇంకా తేలలేదని, సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి ప్రచారానికి తాను వెళ్లనున్నట్లు చెప్పారు. తెలంగాణ జన సమితి బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తామని కోదండరాం వివరించారు. ఇందులో భాగంగా సభలు, సదస్సులు, ధూంధాంలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా ఈ ఆరు సీట్లకు శుక్రవారం రాత్రి వరకు అభ్యర్థు ల్ని ప్రకటిస్తామని టీజేఎస్‌ అధినేత తెలిపినా.. జాబితా మాత్రం వెల్లడికాలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top