దేశ గతిని మారుద్దాం

KCR Comments On Rahul Gandhi - Sakshi

ఆ శక్తి తెలంగాణకే ఉంది

16 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీని శాసిస్తా

అల్లాదుర్గం, నర్సాపూర్‌ ఎన్నికల సభల్లో కేసీఆర్‌

ప్రజల ఎజెండా, ప్రగతి ఎజెండా అమలుచేస్తాం

బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర విమర్శలతో డ్రామాలాడుతున్నాయి

ఇందిర నుంచి రాహుల్‌ వరకు గరీబీ పేరు చెప్పుకుని బతుకుతున్నారు

వీళ్ల మాటల్లోపడి ఆగమాగం కావొద్దని ఓటర్లకు సూచన

రాహుల్, మోదీ ఏం మాట్లాడుతున్నరు. ప్రధానమంత్రి చోర్‌ హై అని రాహుల్‌గాంధీ అంటడు. లేదు.. లేదు.. తల్లీకొడుకులిద్దరు పెద్ద దొంగలు బెయిల్‌ మీద బయట తిరుగుతున్నరు అని మోదీ అంటడు. ఇన్నాళ్లూ దేశాన్ని పాలించి ఏం చేశారు. తెనాలి రామలింగడు కథలో ఒకడు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడిసినట్లు చేస్తా.. అన్నట్లుంది. 1974, 75లో సిద్దిపేటలో నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని పిలుపునిస్తరు. ఆ తర్వాత ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ, ఆ తర్వాత పీవీ నరసింహారావు, ఆ తర్వాత మన్మోహన్‌సింగ్‌.. ఇప్పుడు రాహుల్‌ దాకా అందరూ అదే మాట అంటున్నారు. ఎన్ని దశాబ్దాలు ఇలా గరీబులంటరు.    – కేసీఆర్‌

సాక్షి, కామారెడ్డి/మెదక్‌ : ‘స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయి. 72 ఏళ్ల కాలంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. దేశంలో ఇప్పటికీ తాగునీళ్లు దొరకని, కరెంటులేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దీనికంతటికీ కారణం ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలే. ఈ పరిస్థితుల్లో దేశగతిని మార్చే శక్తి ఒక్క తెలంగాణకే ఉంది. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీని శాసిస్తా. ప్రజల ఎజెండా, ప్రగతి ఎజెండా అమలవుతుంది’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభను సంగారెడ్డి జిల్లాలోని అందోల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా.. కేసీఆర్‌ మాట్లాడుతూ దేశంలో విధానాలు మారినప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకరినొకరు తిట్టుకుంటున్నాయని, ప్రధాని చోర్‌ అని రాహుల్‌ అంటే రాహుల్‌ బడా చోర్‌ అని ప్రధాని అంటున్నాడని, ఇద్దరి నడుమ మనం ఆగమాగం కావొద్దని ఓటర్లకు సూచించారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని పాలించి దరిద్రం అంటగట్టాయని, ఆ దరిద్రాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో రైతుల పరిస్థితి మెరుగుపడాలని, పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే సంకల్పం టీఆర్‌ఎస్‌కు ఉందన్నారు.

ఎవరితోనూ కలవబోం!
రాహుల్, మోదీ ఇద్దరు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నందున వాళ్లతో కలవాల్సిన అవసరం తమకు లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలతో టీఆర్‌ఎస్‌ మమేకమైపోయిందని.. ప్రజల అవసరాలే టీఆర్‌ఎస్‌ ఎజెండా అని సీఎం అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజలకే ఏజెంటని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 మందిని గెలిపిస్తే ఢిల్లీని శాసించి దేశగతిని మార్చి ప్రగతి బాటపట్టిస్తామన్నారు. ప్రజల ఎజెండా ప్రగతి ఎజెండాగా ముందుకు సాగుతామని, దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. 15ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, దానిని ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలను ఆకర్షించాయని పేర్కొన్నారు.

ఆగం కావొద్దు
తెలంగాణ రాకుంటే, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుండా ఉండి ఉంటే ఏం జరిగుండేదో గుర్తించాలని సీఎం ప్రజలను కోరారు. ఎన్నికలు రాగానే రకరకాల పార్టీలు, చాలామంది వ్యక్తులు వచ్చి ఎన్నో విషయాలు మాట్లాడుతారన్నారు. వాళ్లు చెప్పిన మాటలు విని ఆగం కావద్దని, వాటిలో మంచి, చెడు బేరీజు వేసుకుని చర్చపెట్టాలని కోరారు. మంచి నిర్ణయం తీసుకుని ఓటేస్తే మంచి జరుగుతుందన్నారు. ఐదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.10 వేలు అందించడమే కాక రైతుబీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏదేని కారణంతో చిన్న, పెద్ద రైతులెవరు చనిపోయినా తేడా లేకుండా రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నామన్నారు. ఈ పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు.

సాగునీటి కష్టాలు తీరుస్తాం
జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ ప్రాంతం ఎర్ర, నల్ల నేలలు కలిగిన భూములతో రైతులు మంచి పంటలు పండిస్తారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడు నియోజకవర్గాలకు 2,3వేల కోట్లు ఖర్చయినా సరే సాగునీరు అందించి.. రైతుల సాగునీటి కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టును నింపి ఆయకట్టుకు నీరందిస్తామని, ధర్మారావుపేట, మోతె, గుజ్జుల్, కాటేవాడి, అమర్లబండ రిజర్వాయర్లను నిర్మించి అన్ని ప్రాంతాలకు సాగునీటిని అందించే పనులు చేపడుతామని పేర్కొన్నారు. లెండి ప్రాజెక్టు సమస్యపై మహారాష్ట్ర సర్కారుతో చర్చించి బ్రిడ్జి కమ్‌ చెక్‌డ్యాం నిర్మిస్తామన్నారు. మొన్నటి ఎన్నికలకు ముందే నాగమడుగు పథకాన్ని మంజూరు చేయించానని గుర్తు చేశారు. మల్లన్నసాగర్‌ ద్వారా నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్‌ ప్రాంతాలకు నీరందించే కార్యక్రమం చేపడుతామన్నారు.

సింగూరు మీద లిప్టులు నిర్మించి జహీరాబాద్, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మరోసారి అధికారం అప్పగించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నూటికి నూరుశాతం ఎన్నికల హామీలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. జాతీయ రహదారిపై ఆస్పత్రితో పాటు కొత్త మండలాల ఏర్పాటు కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. మనరాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, ఇంకా బాగుపడాల్సిన అవసరం ఎంతోఉందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మంత్రులు మహమూద్‌అలీ, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఫరీదొద్దీన్, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ దఫేదర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నాళ్లీ డ్రామాలు
‘ఎన్ని దశాబ్దాలపాటు గరీబులంటారు.. ఎన్ని దశాబ్దాలు ఈ నినాదాలుంటాయ్‌.. ఎప్పటిదాకా ఈ డ్రామాలు చూడాలి’అని నర్సాపూర్‌లో జరిగిన పార్లమెంటు ప్రచారసభలో బీజపీ, కాంగ్రెస్‌లపై సీఎం విమర్శలు చేశారు. నర్సాపూర్‌లో బుధవారం జరిగిన మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ‘రాహుల్, మోదీలు ఏం మాట్లాడుతున్నరు. ప్రధానమంత్రి చోర్‌ హై అని రాహుల్‌గాంధీ అంటడు. లేదు.. లేదు.. తల్లికొడుకులిద్దరు పెద్దదొంగలు బెయిల్‌మీద బయట తిరుగుతున్నరు అని మోదీ అంటడు. ఇన్నాళ్లూ దేశాన్ని పాలించి ఏం చేశారు.తెనాలి రామలింగడు కథలో ఒకడు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడిసినట్లు చేస్తా.. అన్నట్లుంది. 1974, 75లో సిద్దిపేటలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని పిలుపునిస్తరు. ఆ తర్వాత ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ, ఆ తర్వాత పీవీ నరసింహారావు, ఆ తర్వాత అనంతరం మన్మోహన్‌సింగ్‌.. ఇప్పుడు రాహుల్‌ దాక అందరూ అదే మాట అంటున్నారు. ఎన్ని దశాబ్దాలు గరీబులంటరు’అని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ మళ్లీ న్యాయ్‌ పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

ఒకట్రెండు సంవత్సరాల్లోనే..
‘రెండు పనులు జరగాలి. ఒకటి తెలంగాణ రాష్ట్రం అనుకున్న పద్ధ్ధతిలో అన్ని రంగాల్లో బాగుపడాలి. రెండు భారత దేశం కూడా ఇప్పుడున్న మార్గాన్ని వదిలిపెట్టి మంచి మార్గంలో నడవాలి. ఇప్పుడు నడుస్తలేదు. ఇక్కడ ప్రధానమైన సమస్యలు సాగునీరు, కరెంటు. తాగునీటికోసం ఇబ్బందులు పడ్డారు. భగవంతుని దయ మీ దీవెనతో ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీళ్లు మనకు రాబోతున్నాయి. ఒక్కసారి వచ్చినయంటే మెదక్‌ జిల్లాలో అద్భుతం మీరు చూడబోతున్నరు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్, రంగనాయక్‌సాగర్‌.. మన సింగూరు ప్రాజెక్ట్‌ కూడా కాళేశ్వరం నీళ్లతో నిండుకుంటాయి. పాత మెదక్‌ జిల్లాలో 10 నుంచి 11, 12 లక్షల ఎకరాలకు తగ్గకుండా సాగు నీరందిస్తాం. అది కూడా వచ్చే ఏడాది రెండేళ్లోనే. మీరు నిశ్చింతగా ఉండాలి’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఆర్థికవేత్తలు ఏమన్నా సరే..
‘దేశంలో తెలంగాణ తప్ప ఏరాష్ట్రంలో ఉచిత కరెంట్‌ ఇవ్వడం లేదు. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయన రాష్ట్రంలో రైతుకు ఉచిత కరెంట్‌ ఇవ్వరు. మనం పెట్టిన రైతుబంధును ప్రధాని మంత్రి పావలా మందం నకలు కొట్టిండు. రైతుబంధు వేరే రాష్ట్రం వాళ్లు కూడా చేస్తామన్నరు. నేను కూడా కాపోడినే. నాకు రైతుల బాధ తెలుసు. అందుకోసం ఎవరేమన్నా.. ఆర్థికవేత్తలు ఏమన్నా వెనక్కుతగ్గలేదు. తెలంగాణ రైతులు పడ్డ బాధ, వారికున్న అప్పులు, పడే బాధ నాకు తెలుసు కాబట్టి మరో 8, 9 ఏళ్ల వరకు ప్రాజెక్టుల నీళ్లు పారాలి. ఫ్రీ కరెంట్‌ రావాలి. రైతుబంధు పెట్టుబడి సాయం రావాలి. రైతుబీమా కొనసాగాలి. అప్పడేమవుతది.. ఉన్న అప్పులన్నీ తీరిపోయి.. ప్రతి రైతు దగ్గర మూడు లక్షలో, ఆరు లక్షలో, పది లక్షలో, 15 లక్షలో బ్యాంక్‌లో బ్యాలెన్స్‌ వస్తది. అదీ బంగారు తెలంగాణ. అది కావాలని చెప్ప నేను తండ్లాడుతున్నా. అది జరిగిన నాడు చాలా బాగుంటది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

బీజేపీవి హీనమైన నినాదాలు
‘నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 2014 ఎన్నికల సమయంలో నల్లధనాన్ని ఎక్కడ ఉన్నా తెస్తాం. గింత వస్తది.. ప్రతి ఇంటికీ 15 లక్షలు ఇస్తం అన్ని గొప్పలు చెప్రిండ్రు. ఏడాదైంది.. ఆ తర్వాత మాటమార్చిండ్రు. అంతేకాదు.. వారివి హీనమైన నినాదాలు తప్ప దేశాన్ని బాగు చేసేవి కావు. గతంలో చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అంటూ డ్రామాలు చేస్తున్నరు. క్రియాహీనమైన నినాదాలు వాడుతున్నరు. వనరులు, నిధులు వాడుకునే తెలివి కూడా వాళ్లకు లేదు. 20లక్షల కోట్లు రిజర్వ్‌ బ్యాంకులో మూలుగుతున్నయ్‌. పేదల అభివృద్ధికి వాటిని వినియోగించని స్థితిలో ఉన్నరు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలి’అని కేసీఆర్‌ కోరారు.

కంటిన్యూ చేస్తాం
‘కరెంట్‌ బాధలు తొలిగిపోయినయ్‌. మళ్లీ కరెంట్‌ బాధలు రావు. ఐదేళ్ల కింద మనం ఎక్కడున్నం. ఎన్ని మోటార్లు కాలుతుండే. ఎన్ని బాధలుండే. ఎన్ని లంచాలు ఇచ్చేదుండే. ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతుండే. నేడు ఆ సమస్య లేదు. మంచినీళ్ల బాధ కూడా మిషన్‌ భగీరథతో పోతుంది. మీ కళ్ల ముందే పనులు జరుగుతన్నయ్‌. ఈ సంవత్సరం జరంత ట్రబులైనా మీరు ఓపిక పట్టాలి. ఓర్చుకోవాలి. కానీ ఒకసారి ఎండాకాలం పోయిందంటే. మీ ఇంటికే నీళ్లు. ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున దర్జాగా వస్తాయి. భవిష్యత్తులో ఆడబిడ్డ బిందె పట్టుకుని బజారుకు పోయే అవసరం ఉండదు. ఇటువంటి మంచి కార్యక్రమాలతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. చాలా బాగా జరుగుతున్నయి. వీటిని కంటిన్యూ చేస్తం’అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

సంతృప్తి ఉంది..
రైతుబీమా పథకంపై నాకు చాలా సంతృప్తి ఉంది. 5 గుంటల భూమి ఉన్న రైతు చనిపోయినా.. పది రోజుల్లోపు రూ.5 లక్షల వారి కుటుంబం ఖాతాల్లో జమవుతున్నాయి. మీ అందరికి తెలుసు. మీ కళ్ల ముందే జరుగుతున్నయ్‌. ఈ పథకం కూడా ఒక్క తెలంగాణలోనే ఉంది. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినం. వృత్తి పనివాళ్లను ఆదుకున్నాం. యాదవ సోదరుకు గొర్రెలు, మత్స్యకారులుకు చేపపిల్లలు ఇచ్చినం. చేనేత కార్మికులను ఆదుకున్నాం. అన్ని రంగాల్లో ఇంత తక్కువ కాలంలో నాలుగున్న సంవత్సరాలలో కష్టపడి నోరుకట్టుకుని కడుపుకట్టుకుని పనిచేసినం. కాబట్టే ఇది సాధ్యమైంది. తండాలను గ్రామపంచాయతీలు చేసినం. గిరిజన సోదరులు ఎప్పటి నుంచో కోరుతున్నా.. ఎవరూ చేయలేదు. ఇప్పడు సా«ధ్యమైంది. ఎంఎంటీఎస్‌తోపాటు కొన్ని కోరికలను ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఇబ్బందేమీ లేదు. అన్నీ నెరవేరుస్తాం. మన గవర్నమెంట్‌ ఉంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు.

వాళ్లది అహంకారం
‘అన్ని రాష్టాల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రులు ఉన్నా కేంద్రంలో ఏర్పాటు చేయలేదు. యూపీఏతోపాటు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా పెట్టలేదు. ప్రజలు ఏం చేస్తారనే అహంకారం వాళ్లది. దేశంలో 3.5లక్షల మెగావాట్ల కరెంట్‌ ఉత్పత్తి ఉన్నా.. ఇంకా చీకటి పరిస్థితులే ఉన్నాయి. అదేవిధంగా 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నా తాగు, సాగు నీరు లేక జనం ఇబ్బంది పడుతున్నరు. ఇప్పటికై ఈ పరిస్థితుల్లో ప్రజలు మార్పు తేవాలి’అని సీఎం అన్నారు. కేసీఆర్‌ సభావేదిక వద్దకు రాకముందు.. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావ్‌ మాట్లాడుతూ.. మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జిల్లా సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ఏ జాతీయ పార్టీకి ఎన్నికల ఎజెండా లేదని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కేశవరావు విమర్శించారు.

కేసీఆర్‌ మరో విడత ప్రచారం
 టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల కోసం మూడో విడత ప్రచారం చేయనున్నారు. ముందుగా ఏప్రిల్‌ 4 వరకు కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఆది లాబాద్‌ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలో ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్‌ ఖరారు చేశా రు.  ఈ నెల 8న సాయంత్రం 4 గంటలకు వికారాబాద్‌లో చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌లో ప్రచారం నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. అదే రోజు కానీ, 9న కానీ ఆదిలాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లోనూ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. చేవెళ్ల బహిరంగ ఏర్పాట్లపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, గ్యాదరి బాలమల్లుకు సభ ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.  

బహిరంగసభ నిర్వహణ ఇన్‌చార్జీలు..
ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, కె.మహేశ్‌రెడ్డి, ఎం. ఆనంద్‌లతో పాటు పార్టీ నేతలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, కర్నె ప్రభాకర్, గట్టు రాంచందర్‌రావు, కరిమిళ్ల బాబురావు, పి. కృష్ణమూర్తి, పటో ళ్ల కార్తీక్‌రెడ్డిలను ఇన్‌చార్జీలుగా నియమించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top