
మహిళా ఓటర్లు
గ్రామీణ ప్రాంతాల్లో ఫలానా పార్టీకి, అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఇంట్లోని మగవారు ఇచ్చే సూచనలు,సలహాలకు అనుగుణంగా ఆడవారు నడుచుకుంటారనేది సాధారణంగా అందరి అభిప్రాయం. కానీ ,కర్ణాటకలోని మహిళలు మాత్రం ఈ సూత్రం తమకు వర్తించదంటున్నారు. ఎన్నికలపుడు పురుషులు చెప్పినట్టుగా నడుచుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఓటు వేయడానికి ముందే కులం, మతం, అభ్యర్థులు, పార్టీలు వంటి కీలకాంశాలపై చర్చిస్తున్నారు. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా లోకం చైతన్యం వెల్లివిరుస్తోంది.
–బంట్వాల్‌లోని ఓ చిన్నగ్రామంలో మహిళలు .. పీజీ వరకు అమ్మాయిలకు ఉచిత విద్య కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం..దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఏకరువు పెట్టారు.
‘ఇలాంటవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మాకందరికి అందాలి. అది జరగకపోతే ప్రతీ ఎన్నికల్లో ఓటు వేసి ఏమి ప్రయోజనం’ ఈ గ్రామ యువతి వారిజ వేసిన ప్రశ్న.
–బళ్లారిలోని మోకా గ్రామంలో విరుపాక్షమ్మ అనే వృద్ధురాలు తాను ఎవరికి ఓటు వేయాలన్నది ఇప్పటికే నిర్ణయించినట్టు చెప్పారు. ‘నా కొడుకు బీజేపీకి ఓటేయాలని చెబుతున్నా, నేను మాత్రం హస్తానికే ఓటేస్తాను ’ అంటూ చెయ్యేత్తి హస్తం గుర్తు మాదిరిగా చూపారు.
-హుబ్బళ్ళి నగరానికి చెందిన రైల్వే ఉద్యోగి సుధ హిరేమథ్ మాత్రం ‘అల్పసంఖ్యాక మతం హోదా కల్పిస్తామంటూ మా కులాన్ని (లింగాయత్) కాంగ్రెస్ చీల్చింది. ఇది నాకు అసంతృప్తి కలిగించింది. దీని ఆధారంగానే ఓటేస్తా’నని వెల్లడించింది.
-మూడబిద్రేలోని విద్యాగిరిలో మహిళా టీచర్ల బృందం స్థానిక రాజకీయాలు, బరిలో నిలిచిన అభ్యర్థులు, ఎన్నికల అంశాలపై వాడివేడి చర్చలో మునిగితేలారు. ‘ ప్రధానిగా నరేంద్రమోదీని మీడియా తరచుగా ముందుకు తీసుకొస్తున్నందున, సహజంగానే అది కీలకంగా మారుతుంది. అయితే అన్ని కులాలు, మతాల వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్న సిద్ధరామయ్య వైపే నా మొగ్గు ’ అని కె.పూర్ణశ్రీ పేర్కొన్నారు. అయితే ధర్మస్థలానికి చెందిన రమ్య అనే సహచర ఉపాధ్యాయిని తాను మోదీకే ఓటేస్తానంటూ స్పష్టంచేసింది.
–మొలకల్‌మొర్రులోని రారిబొరనహతిలోని గిరిజన మహిళలు మాత్రం అక్కడ ప్రచారానికి వచ్చిన ఓ అభ్యర్థి అనుయాయులను ఉద్ధేశించి తెలుగులో ‘ వారికి కాదు (మగవారు) మాకు ఇవ్వండి’ అంటూ అక్కడ నెలకొన్న పరిస్థితిని ఎత్తిచూపారు. పురుషులకే అన్ని ఇస్తున్నారు. వారికే ఏమైనా ముట్టజెబుతున్నారు. మరి మా సంగతేంటి ? ’ అంటూ హŸలాల్‌కేరే నియోజకవర్గంలోని సకమ్మ ప్రశ్నించింది.
–మొల్కల్‌మురు పట్టణానికి చెందిన ధనమ్మ ‘ నా ఓటు లెక్కలోకి వచ్చేదని తెలుసు. మహిళలకు సహాయపడి, మా పిల్లలు జీవితంలోకి పైకి వచ్చేందుకు సహకరించే వారికే ఓటువేస్తాను. పలానా వారికి వేయాలని ఎవరో చెబితే దానిని పాటించేందుకు సిద్ధంగా లేను’ అని నొక్కిచెప్పింది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్