
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ చేపట్టిన ఎన్నికల వ్యూహం బెడిసికొట్టిందా?. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ప్యాడ్ మ్యాన్ సినిమా స్పూర్తితో కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైనట్లు సమాచారం. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మై బహన్ మాన్ యోజన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ బీహార్‌లోని ఐదులక్షల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంగానే ఉన్నా.. మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్లపై వివాదం రాజుకుంది. శానిటరీ ప్యాడ్ కవర్‌పై రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన మై బహన్ మాన్ యోజన పథకం వివరాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించడంపై బీజేపీ, ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మహిళల్ని కించపరిచేలా, వారి గౌరవాన్ని తక్కువ చేసేలా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి ‘రాహుల్ ఫోటోతో శానిటరీ ప్యాడ్ పంపిణీ చేయడం మహిళల్ని అవమానించినట్లేనని ’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శల్ని ఖండిస్తోంది. నెలసరి సమయంలో మహిళల బాధల్ని ప్రపంచానికి చూపేలా శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది.
మై బహన్ మాన్ యోజన పథకం వివరాలు
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2,500 నేరుగా నగదు సహాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్లు చెప్పింది. మహిళల గౌరవాన్ని, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఈ పథకం పేరు మై బహన్ మాన్ అని పెట్టినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు, నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా మహిళా సంభాషణ అనే కార్యక్రమం ద్వారా 2 కోట్ల మహిళలతో నేరుగా సంప్రదింపులు జరుపుతోంది.