అక్కడ బీజేపీ ఓటమే బీఎస్పీ లక్ష్యం..!

Karnataka Assembly Elections, BSP Plans To Take Revenge On BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పంతం.. పంతం.. పంతం నీదా నాదా సై..! అవును రాజకీయ రణరంగంలో విశ్రమించడం ఉండదు. అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. పోట్లాడుకునే వేదికలు మారుతుంటాయ్‌ అంతే.. మొన్న, నిన్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో దెబ్బకు దెబ్బ అన్నట్టు సాగిన బీజేపీ, బీఎస్పీ మధ్య పోరు ఇక కర్ణాటకకు మారింది. అదేంటీ.. అక్కడ ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్‌, బీజేపీలే కదా. మరి మధ్యలో బీఎస్పీ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..  

విషయం ఏంటంటే.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ కంచుకోటలు గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ స్థానాల్లో విజయం సాధించి ఎస్పీ- బీఎస్పీ కూటమి ఆ పార్టీకి గట్టి సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్యంగా క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా వచ్చిన ఓట్లతో బీజేపీ తన తొమ్మిదో అభ్యర్థిని గెలిపించుకొని బీఎస్పీపై ప్రతీకారం తీర్చుకుంది.

ఈ పోటాపోటీ ఎత్తులు పైఎత్తులు 20 శాతం దళిత జనాభా ఉన్న కర్ణాటకకు మారాయి. దళిత ఓటర్ల మద్దతుతో కర్ణాటకలో బీఎస్పీ పోటీ చేయబోతున్న 20 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి బీజేపీకి అధికారాన్ని దూరం చేయాలని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి పావులు కదుపుతున్నారు. దానిలో భాగంగానే దేవెగౌడ సారథ్యంలోని జేడీ(ఎస్‌)తో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో రెండు నెలల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీల్లో ఎవరి పాచికలు పారతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top