
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్ చెన్నైలో భేటీ అయ్యారు. పోయెస్ గార్డెన్‌లోని రజనీ నివాసానికి ఆదివారం మధ్యాహ్నం వెళ్లిన కమల్.. ఈ నెల 21న మదురైలో పార్టీ ప్రకటన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గంటసేపు భేటీ తర్వాత వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
తామిద్దరం మంచి మిత్రులమనీ, ఏ కార్యక్రమం చేపట్టినా పరస్పరం తెలియజేసుకుంటామని కమల్ చెప్పారు. రాజకీయ కార్యాచరణపై రజనీ తనను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించారు. సినిమాల తరహాలోనే రాజకీయాల్లో కూడా తామిద్దరి దారులు వేర్వేరని వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి చెన్నై గోపాలపురంలోని నివాసంలో కరుణానిధిని కలిసిన కమల్, ఆయన ఆశీస్సులు అందుకున్నారు.