అసామాన్యుడు

Juvvadi Chokka Rao SPecial Story on Lok Sabha Election - Sakshi

మర్రి చెన్నారెడ్డిని ఓడించిన హ్యాట్రిక్‌ వీరుడు

పదవులకు వన్నె తెచ్చిన జువ్వాడి చొక్కారావు

పదిసార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలిచిన నేత

ఎమ్మెల్యేగా, ఎంపీగా కరీంనగర్‌కు సేవలు

కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం.. నిజాయితీ, నిబద్ధతలకు నిదర్శనం ఆయన. పైరవీలకు దూరంగా ఉండే నాయకుడు. అదే ఆయన వ్యక్తిత్వం. ఎన్ని పదవులు అధిష్టించినా.. ఎన్నికల సంగ్రామంలో మహామహులను మట్టి కరిపించినా.. గర్వాన్ని దరి చేయని అతి సామాన్యుడు ఆయన. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా మూడుసార్లు, ఎంపీగా మరో మూడుసార్లు ఎన్నికైన ఆ అ‘సామాన్యుడే’ జువ్వాడి చొక్కారావు.
విద్యార్థి నాయకుడిగా, ఆర్య సమాజ్‌ సారథిగా, హైదరాబాద్‌ రాష్ట్ర విమోచన పోరాటంలోను, రాష్ట్రంలో సహకార ఉద్యమంలోను ఆయన పాత్ర క్రియాశీలకం. నాటి స్వాతంత్య్రోద్యమ పోరాటం మొదలు.. నక్సల్బరీ ఉద్యమం ... తెలంగాణ తొలి దశ ఉద్యమాలను దగ్గరి నుంచి చూసిన జువ్వాడి చొక్కారావు నిజాయితీకి నిలువుటద్దం.

కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జువ్వాడి చొక్కారావు. వరుసగా 8, 9, 10వ లోక్‌సభ ఎన్నికల్లో విజయాలను సాధించి హ్యాట్రిక్‌ ఎంపీగా నిలిచిన చొక్కారావు నికార్సయిన రైతాంగ ప్రతినిధి. పార్లమెంట్‌లో వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతేరాజు అన్న నినాదాన్ని నిజంచేయడానికి అవసరమైన ప్రతిపాదనలను సూచించి ప్రభుత్వానికి  నివేదిక సమర్పించిన రైతుబాంధవుడు చొక్కారావు.

1957లో తొలిసారి ఎమ్మెల్యేగా...
చొక్కారావు 1957లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పీడీఎఫ్‌ అభ్యర్థి వి.ఆర్‌.రావును ఓడించారు. ఆ తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్‌ అభ్యర్థి ఎ.కిషన్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. మళ్లీ 1967, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 1978లో జనతా పార్టీ హవాలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి నల్లమాచు కొండయ్య చేతిలో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ, రవాణా, వ్యవసాయ, చక్కెర పరిశ్రమ, దేవాదాయ, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ మంత్రిగా సేవలందించారు.

సీఎం మర్రిని ఓడించిన ధీరుడు
కరీంనగర్‌ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలుపొంది, రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పదవులు అధిష్టించిన చొక్కారావు 1984 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన అంగరక్షకుల ఘాతుకానికి బలైన తర్వాత ఈ పార్లమెంట్‌ ఎన్నికలు జరిగినప్పటికీ, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభంజనం బలంగా వీచింది. ఆ సంవత్సరం జరిగిన ఎనిమిదో లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థిగా అప్పటికే ఓసారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన తెలంగాణ ఉద్యమ నాయకుడు మర్రి చెన్నారెడ్డి టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్‌(ఎన్‌డిపిఐ)గా రంగంలోకి దిగారు. చొక్కారావు ఏకంగా 78వేల మెజారిటీతో మర్రి చెన్నారెడ్డిని ఓడించి రికార్డు సృష్టించారు. అనంతరం వరుసగా 1989లో జరిగిన 9వ లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చల్మెడ ఆనందరావుపై, 1991 ఎన్నికల్లో సీపీఐ(ఎంఎల్‌) అభ్యర్థి ఎన్‌.వి. కృష్ణయ్యపై గెలిచి హాట్రిక్‌ సాధించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎల్‌. రమణ చేతిలో ఓడిపోయిన తర్వాత దాదాపుగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.

చొక్కారావు దేవాదుల..
జువ్వాడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కూడా విధులు నిర్వర్తించారు. 1923 ఆగస్టు 23న కరీంనగర్‌ జిల్లా ఇరుకుల్ల గ్రామంలో జన్మించిన ఆయన 1999 మే 28న (75వ ఏట) హైదరాబాద్‌లో చనిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దేవాదుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కి జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చొక్కారావు కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడు. కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, వర్కింగ్‌ కమిటీ మెంబరు, ఎలక్షన్‌ కమిటీ సభ్యుడు, రీజినల్‌ కమిటీ చైర్మన్, ఏఐసీసీ సభ్యుడిగా పార్టీకి సేవలందించారు. చొక్కారావుకు ఉద్యమ నేపథ్యం కూడా ఉన్నది. హైదరాబాద్‌ రాష్ట్ర విమోచన పోరాటంతో పాటు రాష్ట్రంలో సహకార ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.  నరేశ్‌ ఆముదాల, సాక్షి – సిటీడెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top