Telangana: బీజేపీ టార్గెట్‌ @8!

BJP Exercise to increase voting percentage - Sakshi

ఎంపీ టికెట్లకు కమలదళంలో అప్పుడే పోటీ 

ఎనిమిది సీట్లపై పార్టీ అధిష్టానం గురి

ఓటింగ్‌ శాతం పెంచుకునేందుకు కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరో మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ తోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీచేసిన బీజేపీ 4 సెగ్మెంట్‌లలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరి చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి 7% ఓట్లు సాధించిన పార్టీ,   మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతానికి ఓటింగ్‌ను పెంచుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొందడమే కాకుండా 18 శాతం ఓటింగ్‌ను నిలుపుకుంది. 19 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో బీజేపీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలవగా, 49 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 25శాతానికి ఓటింగ్‌ పెంచుకొని ఎనిమిది సీట్లు సాధించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 

సిట్టింగ్‌ స్థానాలపై స్పష్టత !  
సిట్టింగ్‌ ఎంపీలైన కేంద్రమంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (కరీంనగర్‌), అర్వింద్‌ ధర్మపురి (నిజామాబాద్‌) ఆయా స్థానాల నుంచే మళ్లీ పోటీకి ఇప్పటికే సిద్ధమయ్యారు. బోథ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆదిలాబాద్‌ ఎంపీ సొయం బాపూరావుకు ఈసారి పోటీకి మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాథోడ్‌ బాపూరావును ఈసారి ఆదిలాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నాయనే చర్చ పార్టీలో సాగుతోంది.

ఆయనతోపాటు ఈసారి ఖానాపూర్‌ నుంచి ఓడిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్‌ ఎంపీ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్‌ గెలిచిన జోరు మీదున్న బీజేపీ ఎంపీ సీటును కచ్చితంగా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్‌లలోనూ పార్టీ విజయం సాధించడం, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు హామీని నిలుపుకున్నందున నిజామాబాద్‌ ఎంపీ స్థానాన్ని మళ్లీ  కైవసం చేసుకుంటామనే  విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.

మిగిలిన స్థానాల్లో ఇలా....
సిట్టింగ్‌ స్థానాలు మినహా మిగిలిన 13 ఎంపీ సీట్లలో పోటీకి కొందరు ముఖ్యనేతలు గట్టిగానే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. 

► మల్కాజిగిరి నుంచి పోటీకి బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌ పి.మురళీధర్‌రావు, మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణకు జాతీయ నాయకత్వం నుంచి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. అయితే మహబూబ్‌నగర్‌ నుంచి పోటీకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన టి.ఆచారి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

► మెదక్‌ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్‌లలో ఎక్కడో ఒకచోట నుంచి పార్టీ అగ్రనాయకత్వం అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధమేనని సీనియర్‌నేత ఈటల రాజేందర్‌ తన సన్నిహితుల వద్ద సంకేతాలిచ్చి ఆ దిశలో ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. 

► చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎప్పటి నుంచో కసరత్తు కూడా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే దానికి సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టు పార్టీవర్గాల సమాచారం.

►  భువనగిరి సీటు  తనకు టికెట్‌ వస్తుందని మాజీ ఎంపీ డా. బూరనర్సయ్యగౌడ్‌ ఆ లోక్‌సభ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. 

►  గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ జహీరాబాద్‌ నుంచి ఎంపీగా పోటీకి గతం నుంచి ఉత్సాహం కనబరుస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వీరశైవ లింగాయత్‌ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్‌ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్‌ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

► పెద్దపల్లి నుంచి పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

► నాగర్‌కర్నూల్‌ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతిని బరిలో దింపడం లేదా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశముంది. 

► వరంగల్‌ టికెట్‌ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌ గట్టిగా కోరుతున్నట్టు తెలిసింది. 

► నల్లగొండ స్థానానికి గతంలో పోటీ చేసిన గార్ల జితేందర్‌ లేదా సూర్యాపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సంకినేని వెంకటేశ్వర్‌రావుకు చాన్స్‌ దక్కుతుందా, ఇంకా ఎవరైనా కొత్తవారికి ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది.

► హైదరాబాద్‌ స్థానం నుంచి భగవంత్‌రావుకు అవకాశం కల్పించవచ్చుననే ప్రచారం జరుగుతుండగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయించినా అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ నేతల్లో ఉంది. 

► మహబూబాబాద్‌ నుంచి రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం.

► ఖమ్మం నుంచి పార్టీనేత, తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా ఇంకా మరెవరికైనా టికెట్‌ ఇస్తారా చూడాలని పార్టీ నేతలు అంటున్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top