ఓటుకు రూ. రెండు వేలు ఇచ్చాం : జేసీ

JC Diwakar Reddy Vulgar Comments On Voters - Sakshi

తిండి లేనివాడు ఓటుకు రూ.5 వేలు డిమాండ్‌ చేశాడు 

అవినీతి సొమ్మును పంచాల్సి వచ్చింది 

చంద్రబాబు 120 పథకాలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు : జేసీ

సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో రూ.50 కోట్లు ఖర్చుపెట్టానని, తిండి లేనివాడు కూడా ఓటుకు రూ.5 వేలు డిమాండ్‌ చేశాడని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు రూ.25 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేశారని, అన్ని పార్టీలు కలిపి రూ.10 వేల కోట్లు వ్యయం చేశాయని చెప్పారు. తన కుమారుడు ఎంపీగా పోటీ చేసిన అనంతపురం నియోజకవర్గంలో ఓటు వేయాలని అడిగితే తినడానికి తిండి లేని వాళ్లు కూడా రూ.ఐదు వేలు డిమాండ్‌ చేశారని, రూ.రెండు వేలు ఇచ్చామని అన్నారు. ఇకపై ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.ఐదు వేలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

చదవండి : ఓటర్లపై జేసీ దివాకర్‌రెడ్డి బూతు పురాణం

ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామని, అవినీతి సొమ్మునే పంచాల్సి వస్తోందని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గించాలని, జనం డబ్బు లేకపోతే ఓటేయడానికి ముందుకు రావడం లేదన్నారు. చంద్రబాబు 120 పథకాలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడు, బట్ట పెట్టలేదన్నారు. తమ పార్టీని నిలబెట్టేది కేవలం పసుపు కుంకుమ, పింఛన్లు మాత్రమేనని, ఈ రెండూ లేకపోతే తమ పరిస్థితి ఏమయ్యేదో ఆ దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేశామన్నారు. పోలింగ్‌కు ఇంకా ముందు ఈ సొమ్ములు వారి ఖాతాల్లో వేసి ఉంటే తమ పరిస్థితి అథోగతేనని చెప్పారు. అనంతపురం లోక్‌సభ పరిధిలో అభ్యర్థులందరినీ మార్చాలని, లేకపోతే గెలవలేమని చెప్పానని, అయినా మార్చలేదన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top