ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ జోడీ: జైపాల్‌రెడ్డి

Jaipal Reddy comments on Modi and KCR - Sakshi

జడ్చర్ల: ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోడీ కట్టారని మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మోదీ సహకారంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమయంలో బాహాటంగా బీజేపీతో కలిసి వెళతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ 1971లో గరిబీ హఠావో నినాదంతో ముందస్తుకు వెళ్లినప్పుడు గెలిచారని, తర్వాత వెళ్లిన అన్ని సందర్భాల్లో ఓడిపోయారని గుర్తుచేశారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వాజ్‌పేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా మంచి ఫలితాలు రాలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం గ్రామాల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు.  

ప్రాజెక్టులపై కేసీఆర్‌ అబద్ధాలు: నాగం 
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. 2003లో కేఎల్‌ఐ ప్రారంభించామని, 2004లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత జిల్లాలో కేఎల్‌ఐ, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడం దారుణంగా ఉందన్నారు. రూ.1,000 కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదన్నారు. దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 30 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి, 33 నెలలు గడిచినా పూర్తి కాలేదన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి, రాంచంద్రారెడ్డి, మినాజ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top