కేంద్రం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది

India Global Power And Modi Is Global Leader Says GVL Narasimha Rao - Sakshi

సాక్షి, విశాఖపట్నం : పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన ‘రివర్స్ టెండరింగ్‌’లో రూ. 200 కోట్లు ఆదా అయిందంటే ఆహ్వానించదగ్గ పరిణామమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి పోలవరం నిర్మిస్తామంటే కేంద్రానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. కార్పోరేట్‌లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పెట్టుబడులు రావటం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని అన్నారు.

భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రపంచమంతా భారతదేశాన్ని విశ్వశక్తిగా.. ప్రధాని నరేంద్రమోదీని విశ్వనాయకుడిగా గుర్తిస్తోందని అన్నారు. టీడీపీ సొంత తప్పిదాల వల్లే ఓటమి మూటగట్టుకుందని అన్నారు. పీపీఏల్లో అవినీతి లేదని తాము చెప్పటం లేదని, సూచన మాత్రమే చేశామని తెలిపారు.

పార్టీలోకి వచ్చినంత మాత్రన కేసులు మాఫీ కావు
బీజేపీ అవినీతికి ఎప్పుడూ వ్యతిరేకమేనని, తమ పార్టీలోకి వచ్చినంత మాత్రాన వారి కేసులు మాఫీ కావని జీవీఎల్‌ నరసింహరావ్‌ స్పష్టం చేశారు. టీడీపీనుంచి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పని చెయ్యాలని తెలిపారు. వారి కేసులకు సంబంధించి వారే సమాధానం చెప్పుకోవాలని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top