అంచనాలకు మించి విజయాలు.. అయినా ప్చ్‌! | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 9:53 AM

Hung assembly in Karnataka, JDS is kingmaker - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతానికి అందుతున్న ట్రెండ్స్‌ ప్రకారం కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచి.. సాధారణ మెజారిటీని సాధించే అవకాశం కనిపిస్తోంది.  ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం..  బీజేపీ 122 స్థానాల్లో, కాంగ్రెస్‌ 58 స్థానాల్లో, జేడీఎస్‌ 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తానికి మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశముందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. హంగ్‌ అసెంబ్లీ వస్తే.. జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతుందని పేర్కొన్నాయి. అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి జేడీఎస్‌ విజయాలు సాధించింది. ఏకంగా ఆ పార్టీ 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను అధిగమించడంతో జేడీఎస్‌ ప్రభావం పెద్దగా ఉండే అవకాశం కనిపించడం లేదు.

మొదట కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళి.. హంగ్‌ అసెంబ్లీని సూచించింది. దీంతో సహజంగానే కింగ్‌ మేకర్‌గా నిలిచే అవకాశమున్న జేడీఎస్‌పై అందరి దృష్టి పడింది. దీంతో ఆ పార్టీ మద్దతు కోసం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ రంగంలోకి దిగారు. జేడీఎస్‌ను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ పెద్దలు అశోక్‌ గెహ్లాట్‌, గులాం నబీ ఆజాద్‌ దేవెగౌడకు ఆఫర్‌ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఇటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అయిన అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ హుటాహుటిన బెంగళూరు బయలుదేరడంతో జేడీఎస్‌తో మంతనాల కోసమేనని భావించారు. కానీ కాసేపటిలోనే ఫలితాలు మారడం.. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలోకి రావడంతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ ఆశలు గల్లంతయ్యాయి. గతంలో కన్నా ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలుపొందినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం మాత్రం లేకపోయింది.

Advertisement
Advertisement