ఆలయ నిర్మాణంతో ఉద్యోగాలొస్తాయా!

Huge Unemployment in Uttar Pradesh Effect Poll - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. తద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. వ్యవసాయ రుణాలను రద్దు చేస్తాం. బాలికలకు ఉచిత విద్యను అందజేస్తాం. అవీనితిని నిర్మూలిస్తాం’ అన్న హామీల ద్వారా 2017లో జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించనప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకున్న ఆకర్షణ శక్తితోని ప్రజలంతా బీజేపీకి పట్టంకట్టారు. 403 సీట్లకుగాను 325 సీట్లను బీజేపీ గెలుచుకుంది. యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 13.25 శాతం నిరుద్యోగం ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పటికే దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ శాతం పెరుగుతూ వచ్చింది. పెద్ద నోట్ల రద్దు కారణంగానే ఒక్క 2018 సంత్సరంలోనే దేశంలో 1.10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ముఖ్యంగా అసంఘటిత రంగంలోనే ఎక్కువ మంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ నివేదిక వెల్లడించింది. దేశంలోకెల్లా ఎక్కువ మంది యువకులు కలిగిన యూపీ రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఉపాధి కోల్పోయారని పలు అంచనాలు తెలియజేస్తున్నాయి. కచ్చితమైన అంకెను మాత్రం ఎవరూ అంచనా వేయలేక పోయారు. 20 కోట్లకు పైగా జనాభా కలిగిన యూపీ సగటు ఆదాయం ప్రకారం దేశంలోనే రెండో పేద దేశం. అక్షరాస్యతలో 35 రాష్ట్రాలకుగాను 29వ రాష్ట్రం. జనాభా పరంగా లెక్కేస్తే నిరక్షరాస్యతలో ప్రథమ రాష్ట్రం అవుతుంది. కనుక అసంఘటిత రంగంలోనే నిరుద్యోగుల సంఖ్య ఇక్కడ ఎక్కువ. లక్కోలోని చిన్‌హాట్‌ అతిపెద్ద లేబర్‌ హబ్‌. ఆ హబ్‌ నుంచి గతంలో దాదాపు నాలుగు లక్షల మంది కార్మికులకు ఉపాధి లభించేది. ఇప్పుడు వారిలో 40 శాతానికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. 

రాష్ట్రంలోని (15–24) యువకుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగంలేక బాధ పడుతున్నారు. వారిలో పీహెచ్‌డీ చేసిన వారే కాకుండా, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఉండడం ఆశ్చర్యం. వీరి సమస్యలను దష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘స్టార్టప్‌ ఇండియా అండ్‌ స్టాండప్‌’ ఇండియా అంటూ రెండు ఉపాధి కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. గత రెండేళ్లలో రాష్ట్రంలో 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని డిప్యూటీ ముఖ్యమంత్రి దినేష్‌ శర్మ తెలిపారు. తమ ప్రభుత్వం శక్తిమేరకు ఉద్యోగాలు కల్పించేందుకు కషి చేస్తోందని, ఈ విషయంలో ఇంకా కచ్చితమైన డేటా తనకు అందాల్సి ఉందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. నిరుద్యోగ సమస్య ఇక్కడి యువతను పీడిస్తున్నప్పటికీ చాలా మంది ఫోన్లలో ‘ మేం అధికారంలోకి వస్తాం, ఆలయాన్ని నిర్మిస్తాం’ అనే రింగ్‌టోన్‌ బీజేపీ ప్రచారంలోకి భాగంగా వినిపిస్తోంది. ఆలయ నిర్మాణంతో అక్కడి యువత దశ తిరుగుతుందని వారు విశ్వసిస్తున్నారేమో!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top