యూపీలో బీజేపీకి 36–55 సీట్లు!

Lok Sabha Election 2019 How Many Seats For BJP In UP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే గత ఎన్నికల్లోలాగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలను పాలకపక్ష బీజేపీ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని 80 సీట్లకుగాను 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లను కైవసం చేసుకోగా, దాని మిత్రపక్షమైన అప్నాదళ్‌ రెండు సీట్లను దక్కించుకుంది. అదే ఊపుతో బీజేపీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ, ములాయం సింగ్‌ నాయకత్వంలోని ఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకోకుండా విడి విడిగా పోటీ చేయడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగాయి. పైగా అజిత్‌ సింగ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌ వచ్చి వాటికి తోడుగా నిలిచింది. ఈ సమయంలో ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి ? ఎవరికి తక్కువగా ఉంటాయి ?

ఈ పార్టీలకు గతంలో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకొని బేరీజు వేస్తే ఓ అవగాహనకు రావచ్చు. అయితే రెండు, మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న మాత్రాన గతంలో ఆ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం నూటికి నూరుపాళ్లు బదిలీ కాదు. ఆ పార్టీలన్నీ కలసికట్టుగా సమన్వయంతో చేసే ప్రయత్నాలపై బదిలీ ఓట్ల శాతం ఆధారపడి ఉంటుంది. ఇలా బదిలీకాని ఓట్లను రాజకీయ శాస్త్రవేత్త నీలాంజన్‌ సర్కార్‌ ప్రకారం సమన్వయ లోపంతో నష్టపోయిన ఓట్లుగా పరిగణించవచ్చు. ఆయన అంచనాల ప్రకారం ఈ బీఎస్పీ, ఎస్పీ మధ్య సమన్వయ లోపంతో ఎనిమిది శాతం ఓట్లు బదిలీ కాకపోయినట్లయితే ఈసారి బీజేపీకి 55 లోక్‌సభ సీట్లు వస్తాయి. దాదాపు ఓట్లు చక్కగా బదిలీ అయితే బీజేపీకి 36 సీట్లకు మించిరావు. 
నిజంగా కాంగ్రెస్‌ పార్టీ ఈ కూటమితో కలిసినట్లయితే కూటమి మరింత బలపడేది. కాంగ్రెస్‌ పార్టీ కోరిన ఏడు సీట్లు ఇవ్వడానికి బీఎస్పీ–ఎస్పీ పార్టీలు అంగీకరించకపోవడంతో ఆ పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అధిక సీట్లను కేటాయించడం వల్ల మొత్తం కూటమి ఓట్ల శాతం బాగా పడిపోయింది. ఇప్పుడు తాను లోక్‌సభకు పోటీ చేయడం లేదని మాయావతి హఠాత్తుగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా కాంగ్రెస్‌ బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు కూడా పొత్తులను ఖరారు చేసుకోవాల్సిస ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top