ఎమ్మెల్యేల తరలింపు, ప్లాన్‌ వన్..టూ.. త్రీ..!

How Karnataka Congress-JDS MLAs Shift Hyderabad to Bengaluru - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కర్ణాటక అధికార పీఠం ఎవరికి దక్కబోతుందో మరికొన్ని గంటల్లో తేలబోతుంది. అధికారం దక్కించుకోవడానికి రేపు బెంగళూరులోని విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌, బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ, నోవాటెల్‌కు తరలించి, భేటీల మీద భేటీలు నిర్వహిస్తోంది. రేపు విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో ఏ విధంగా వ్యవహరించాలో ఎమ్మెల్యేలకు సూచిస్తోంది. నేడు ఉదయం ఇక్కడికి వచ్చిన వీరిని, రేపు ఉదయం కల్లా మళ్లీ బెంగళూరుకు తరలించాల్సి ఉంది. అయితే వీరిని ఏ విధంగా బెంగళూరు తీసుకెళ్లాలి.. మధ్యలో బీజేపీ ఎలాంటి పన్నాగాలకు పాల్పడకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలో అనే అంశాలపై కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఇప్పటికే నిర్ణయించాయి. ఎమ్మేల్యేల తరలింపు మూడు రకాల ప్లాన్లను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అవేమిటంటే...

ప్లాన్ వన్ :
ఇప్పటికే ఎమ్మెల్యేల తరలింపుకు రెండు ప్రత్యేక విమానాలు సిద్ధమైనట్టు తెలిసింది. వీరు ఏ సమయానికి హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరుతారో సరియైన టైం తెలియనప్పటికీ, ఏ క్షణమైనా ఇక్కడి నుంచి బయలుదేరటానికి ఎమ్మెల్యేలందరూ సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు అందింది.  ప్రత్యేక విమానాలు కాబట్టి విమానశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి గంటన్నరలో బెంగళూరుకు చేరుకోవచ్చు. అయితే నిన్న రాత్రి బెంగళూరులో డీజీసీఏ.. ప్రత్యేక విమాన అనుమతిని నిరాకరించింది. దీనిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరో ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది.

ప్లాన్ టూ :
ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేల తరలింపుకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, బస్సుల ద్వారానైనా బెంగళూరుకు తరలించాలని నాలుగు ఏసీ స్లీపర్ బస్సులు రెడీ చేసింది కాంగ్రెస్‌. హైదరాబాద్ టూ బెంగళూరు 550 కిలోమీటర్లు. హై ఎండ్ బస్సులు కావడంతో, బెంగళూరుకు 8 గంటల్లో చేరుకోవచ్చు. తెలంగాణ బోర్డర్ వరకు ఇక్కడి కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఇస్తూ తెలంగాణ బోర్డర్ దాటించిన తర్వాత, ఏపీలోకి ప్రవేశమవుతారు. ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. బెంగళూరుకి అత్యంత సురక్షితంగా వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. అయితే నేడు హైదరాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, రోడ్డు మార్గం ద్వారానే వచ్చారు. దీంతో మళ్లీ రోడ్డు మార్గమే బెస్ట్‌ అని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్లాన్ త్రీ :
ప్రత్యేక విమానాల్లో తరలింపు సాధ్యం కాక.. బస్సుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే మూడో ప్లాన్‌ను కూడా సిద్ధం చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. అదే కార్ల ద్వారా ఎమ్మెల్యేల తరలింపు. ఒక్కో కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున మొత్తం ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి బెంగళూరుకు తరలించడానికి సరిపడ కార్లను సిద్ధం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన కార్లతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ కార్లను ఎమ్మెల్యేల కోసం రెడీ చేశారు. ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కూడా బెంగళూరు వెళ్లేందుకు రెడీగా అయ్యారు. ఇది మూడో ప్లాన్‌. ఈ మూడు రకాల ప్లాన్లతో కాంగ్రెస్‌-జేడీఎస్‌లు తమ పార్టీ ఎమ్మెల్యేలను రేపటికి బెంగళూరు తరలించబోతున్నాయి. విధాన సౌధలో బలపరీక్ష ఎదుర్కోబోతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top