ఇందిర కోసం విమానం హైజాక్‌!

Hijack Plane For Indira - Sakshi

సాక్షి, లక్నో: 1981లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బోలానాథ్‌పాండే అతని స్నేహితుడు కలిసి ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేశారు. ఇంతకీ వారి డిమాండ్‌ ఏమిటో తెలుసా..జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్‌ గాంధీని విడుదల చేయడం. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అనేక మంది ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టించారు. జైల్లోనే వారిని హతమార్చేందుకు కుట్రపన్నారన్న ఆరోపణపై ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అరెస్టు చేసింది. వారిని విడిచిపెట్టాలని డిమాండు చేస్తూ బోలానాథ్‌ ఈ హైజాక్‌కు పాల్పడ్డాడు. పోలీసులు కొన్ని గంటల్లోనే హైజాకర్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బొమ్మ ఆయుధాలతో వారు బెదిరించి హైజాక్‌కు పాల్పడ్డారని గుర్తించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బోలానాథ్‌కు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్టు కూడా ఇచ్చింది. బోలానాథ్‌ రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు సలేంపూర్‌ టికెట్టు ఇచ్చింది. 

జయ.. ‘నాలుగాకులు’


ఎన్నికల్లో కొందరు నాయకులు ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేస్తుంటారు. రెండింటిలోనూ నెగ్గితే ఏదో ఒక దానికి రాజీనామా చేస్తారు.అయితే, 2001లో తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జయలలిత ఏకంగా నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. విచిత్రమేమిటంటే ఆ నాలుగు నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. టాన్సీ భూముల కుంభకోణంలో అప్పటికే జయలలితను దోషిగా ప్రకటించడంతో ఆమె ఎన్నికలకు అనర్హురాలయ్యారు. ఈ కారణంగా ఆమె నామినేషన్లను తిరస్కరించారు. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తు ‘రెండాకుల’పై జయలలిత అండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, పుదక్కొట్టాయ్‌ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు.

ఒకే ఒక్కడు మొరార్జీ


సాధారణంగా ఒక దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశీయుడికే ఇస్తారు. అప్పుడప్పుడు విదేశీయులకు కూడా ఇస్తుంటారు. భారతదేశానికి చెందిన ఒకే ఒక్కరు పాకిస్తాన్‌ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందారు. ఆ ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కు దక్కింది. 1990, మే 19న ఆయనను పాకిస్తాన్‌ ప్రభుత్వం ‘నిషాన్‌ ఏ పాకిస్తాన్‌’ పురస్కారంతో సత్కరించింది. మొరార్జీ తర్వాత ఇంత వరకు మరే భారతీయుడికి ఆ గౌరవం లభించలేదు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య సత్సంబంధాలు మెరుగుపడేందుకు, శాంతి స్థాపనకు మొరార్జీ చేసిన కృషికి గుర్తింపుగా పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది.

ముఖ్యమంత్రి పేరిట డాక్టర్స్‌డే


దేశంలో ఏటా జూలై 1న డాక్టర్స్‌డే (వైద్యుల దినోత్సవం) జరుపుకుంటాం. అయితే, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ బిధాన్‌ చంద్ర రాయ్‌ (బీసీరాయ్‌) జ్ఞాపకార్థం ఈ ‘డే’ జరుపుకోవడం విశేషం. సీఎం అయినప్పటికీ రాయ్‌ తన జీవితాన్ని వైద్యవృత్తికే అంకితం చేశారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ సంస్థ ఏ ర్పాటులో కీలకపాత్ర పోషించారు. వైద్య రం గానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజైన జూలై 1ని డాక్టర్స్‌డేగా పాటిస్తున్నారు. అంతేకాక 1962లో ఆయన స్మారకార్థం బీజీ రాయ్‌ అవార్డును ఏర్పాటు చేశారు. మన దేశంలో వైద్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే. 1961లో రాయ్‌కు ‘భారతరత్న’ లభించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top