సీఎల్పీ విలీనంపై స్పీకర్‌కు నోటీసులు

High Court notice to Telangana speaker - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన తాజా వ్యాజ్యంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ కింద ట్రిబ్యునల్‌ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పార్టీ ఫిరాయించిన పైలట్‌ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డి.సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె.సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు ఇచ్చింది. గతంలో ఇదే తరహాలో దాఖలైన మరో రెండు వ్యాజ్యా లతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఇప్పటికే రిట్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో పదో షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం ట్రిబ్యు నల్‌గా వ్యవహరించే మండలి చైర్మన్‌కు, ఇతర ప్రతి వాదులకు హైకోర్టు మంగళవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మండలిలో మాదిరిగా అసెంబ్లీలోనూ చేయనున్నారంటూ గత ఏప్రిల్‌ 29న కాంగ్రెస్‌ నాయకులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క దాఖలు చేసిన కేసులోనూ అదే తరహా నోటీసులు శాసనసభ స్పీకర్, ఇతరులకు జారీ అయ్యా యి. బుధవారం జరిగిన తాజా రిట్‌ను కూడా ఉత్తమ్, భట్టిలే దాఖలు చేశారు. ఈ కేసులన్నింటినీ కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top