భద్రత బాధ్యత ఎన్నికల సంఘానిదే

High Court Grants Security to Revanth Reddy - Sakshi

అభ్యర్థుల భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఫలితాల వరకు రేవంత్‌రెడ్డికి 4+4 భద్రత కల్పించండి

ఎన్నికల ప్రధాన అధికారికి, డీజీపీకి ఆదేశం

వ్యయాన్ని భరించాలని రేవంత్‌కి స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నేతల భద్రత విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయి, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత ఎన్నికల బరిలో నిలిచిన నేతల భద్రత బాధ్యత ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.

ప్రాణహాని ఉన్నందున భద్రత కల్పించాలని నేతలు అభ్యర్థించినప్పుడు, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తేల్చి చెప్పింది. ఈ బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోజాలదని పేర్కొంది. అధికార పార్టీ నేతలు, సంఘ విద్రోహశక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున కేంద్ర బలగాలకు చెందిన 4+4 సిబ్బందితో భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఆయనకు కేంద్ర బలగాలకు చెందిన 4+4 సిబ్బందితో భద్రత కల్పించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని, రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ భద్రతను కొనసాగించాలని పేర్కొంది. అయితే, ఈ భద్రతకు అయ్యే వ్యయాన్ని మాత్రం రేవంత్‌రెడ్డే భరించాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్‌ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి సోమవారం మరోసారి విచారణ జరిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది భద్రత మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని తెలిపారు. రాజకీయ నేతల భద్రత తమ పరిధిలోని వ్యవహారం కాదని, వ్యక్తిగత భద్రత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని వివరించారు. ఎన్నికలు జరుపుతున్నంత మాత్రాన శాంతి భద్రతల బాధ్యతాధికారం ఎన్నికల సంఘానికి బదిలీ కాదన్నారు.

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సంతోష్‌ వాదనలు వినిపిస్తూ రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్‌ దరఖాస్తును ఎన్నికల ప్రధాన అధికారి తమకు పంపారని, దాని ప్రకారం భద్రత కల్పించేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. గతంలో భద్రతను తగ్గించినప్పుడు రేవంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారని, అప్పుడు కేంద్రం కౌంటర్‌ దాఖలు చేస్తూ భద్రత వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే అప్పుడు తాము పరిశీలిస్తామని చెప్పిందని సంతోష్‌ పేర్కొన్నారు.

జీవితకాలం అడగటం లేదు...
మోహన్‌రెడ్డి స్పందిస్తూ పిటిషనర్‌ జీవితాంతం భద్రత కల్పించాలని కోరడం లేదని, ఈ ఎన్నికల సమయం వరకే భద్రతను కోరుతున్నారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, సీనియర్‌ న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలతో ఏకీభవించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత ఎన్నికల బరిలో ఉన్న నేతల భద్రత బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తేల్చి చెప్పారు.

రాష్ట్రం కల్పించే భద్రతపై మాకు నమ్మకం లేదు
పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల నోటిఫికేషన్, ప్రవర్తనా నియమావళి విడుదలైన తరువాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషనర్‌ గళం విప్పారని, అందువల్ల ప్రభుత్వాధినేతల నుంచి ఆయన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రతపై తమకు నమ్మకం లేదని, ఆ భద్రత సిబ్బంది చేత పిటిషనర్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వానికి ఈ ఉద్దేశం ఉంది కాబట్టే, భద్రత కల్పిస్తామంటూ ముందుకొచ్చిందని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది సంతోష్‌ జోక్యం చేసుకుంటూ ఈ వాదనను ఆమోదిస్తే, రేపటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరూ భద్రత కోసం హైకోర్టుకొస్తారని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘వస్తే రానివ్వండి.. వారికి కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఆ బాధ్యత నుంచి ఎన్నికల సంఘం వెనక్కి వెళ్లలేదు’అని తేల్చి చెప్పారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఎన్‌.రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, వ్యక్తుల భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమన్నారు. గతంలో కూడా తాము ఇదే విషయాన్ని స్పష్టం చేశామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top