‘అయ్యో రామా! నన్నెవరు గుర్తుంచుకోవాలి?’

HD Deve Gowda Says Who Will Remember Me - Sakshi

బెంగళూరు: అస్సాంలోని డిబ్రూగఢ్‌ సమీపంలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద రోడ్డు కమ్‌ రైలు వంతెన(బోగీబీల్) ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బోగీబీల్‌ వంతెనకు 1997లో ప్రధాని హోదాలో తానే శంకుస్థాపన చేశానని పేర్కొన్నారు. అలాంటింది ఇప్పుడు బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తనను పిలవకపోవడం బాధకరమన్నారు. తన పాలన కాలంలో కశ్మీర్‌ రైల్వే, ఢిల్లీ మెట్రో రైల్‌, బోగీబీల్‌ వంతెన పథకాలను మంజూరు చేశానని.. అలాగే ప్రతి ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. కానీ నేడు ప్రజలు ఆ విషయన్ని మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతం మరిచి ప్రవరిస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా మీకు ఆహ్వానం అందలేదా అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా.. అయ్యో రామా! నన్నెవరు గుర్తుంచుకోవాలి? అని చమత్కారంగా సమాధానమిచ్చారు. కాగా, బోగీబీల్‌ వంతెనను మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.  

1997 లోనే ఆమోదం.. 
బోగీబీల్‌ వంతెనను అస్సాం ఒప్పందంలో భాగంగా నిర్మించారు. ఈ ఒప్పందంలో భాగంగా 1997లోనే ఈ బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అదే ఏడాది జనవరి 22న నాటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బోగీబీల్‌ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 2002, ఏప్రిల్‌ 1న ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా అంచనా వ్యయం రూ.3,230.02 కోట్ల నుంచి 85 శాతం పెరిగి రూ. 5,960 కోట్లకు చేరింది. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top