నేనూ ‘యాక్సిడెంటల్‌ ప్రధాని’నే: దేవెగౌడ

HD Deve Gowda Says I Was Also An Accidental Prime Minister - Sakshi

బెంగళూరు: మాజీ ప్రధాని మన్మోహన్‌ బయోపిక్‌పై దుమారం రేగుతున్న వేళ.. తానూ అనుకోకుండా ప్రధాని(యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌) అయ్యాయని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. తాజా వివాదంపై ఆయన స్పందిస్తూ ‘ ఈ సినిమాపై వివాదం గురించి నాకు పెద్దగా తెలీదు. ఆ మాటకు వస్తే నేను కూడా యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌నే’ అని సరదాగా వ్యాఖ్యానించారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బయటి నుంచి కాంగ్రెస్‌ ఇచ్చిన మద్దతుతో దేవెగౌడను ప్రధానిగా ఎన్నుకున్నారు.

కుమారస్వామి.. యాక్సిడెంటల్‌ సీఎం
దేవెగౌడ కొడుకు, కర్ణాటక సీఎం కుమారస్వామిని బీజేపీ ‘యాక్సిడెంటల్‌ సీఎం’గా అభివర్ణించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కరువుతో అల్లాడుతుంటే ఆయన కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సింగపూర్‌లో పర్యటించడంపై మండిపడింది. ‘కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 377 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఇంకా రుణమాఫీ ప్రకటనను అమలుచేయలేదు. సీఎం కుమారస్వామి కొత్త సంవత్సర వేడుకల కోసం సింగపూర్‌ వెళ్తున్నారు. యాక్సిడెంటల్‌ సీఎం పేరిట సినిమా తీస్తే కుమారస్వామి పాత్రను ఎవరు పోషిస్తారు?’ అని బీజేపీ ట్వీట్‌ చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top