హరీశ్‌రావుకు కోపమొచ్చింది

Harish Rao was angry over Mla Muttireddy - Sakshi

     ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వైఖరితో అసహనం

       మైక్‌ విసిరేసి వెళ్లిపోయిన వైనం 

సాక్షి, జనగామ: తన ప్రసంగానికి మధ్యమధ్యలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆటంకం కల్పించడంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు కోపం వచ్చింది. దీంతో ఇక తాను మాట్లాడలేనంటూ మైక్‌ను విసిరివేసి మధ్యలోనే వెళ్లిపోయారు. జనగామ జిల్లా లోని నర్మెట మండలం బొమ్మకూరులో నిర్మించిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్‌–3 ద్వారా నిర్మించిన పంప్‌హౌస్‌ను మంత్రి హరీశ్‌రావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. పంప్‌హౌస్‌ నుంచి కన్నెబోయినగూడెం, లద్నూరు, తపాస్‌పల్లి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. అనంతరం బొమ్మకూరులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ సమయాభావం వల్ల మంత్రి హరీశ్‌రావు మాట్లాడతారని చెప్పి మైక్‌ను అందించారు.

హరీశ్‌ ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే చీటికిమాటికి పక్కనున్న వాళ్లను పిలుస్తూ మాట్లాడారు. ముత్తిరెడ్డి సభలో చేస్తున్న హడావుడిని గమనిస్తున్న మంత్రి.. ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. ఆయనవైపు చూస్తూ మాట్లాడవద్దని సైగ చేశారు. అయినప్పటికీ ముత్తిరెడ్డి సభకు దూరంగా ప్రజాప్రతినిధులను, పార్టీ శ్రేణులను పిలుస్తున్నారు. ముత్తిరెడ్డి వ్యవహారంతోపాటు పక్కనే ప్రారంభించిన పంప్‌హౌస్‌ మోటార్ల శబ్దంతో విసిగిపోయిన మంత్రి చేతిలోని మైక్‌ను విసిరివేశారు. వేదిక నుంచి బయటకు వెళ్తున్న హరీశ్‌రావును ఎమ్మెల్యే ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top