తెలంగాణలో తిరిగొచ్చి మాట్లాడు.. 

Harish Rao Fires on Rahul Gandhi - Sakshi

  ఎవరో చెప్పింది విని విమర్శలు చేయడం తగదు 

  రాహుల్‌ గాంధీపై హరీశ్‌ ఫైర్‌ 

  అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం

    వర్షాలొస్తే ఉసిల్లు వచ్చినట్లు.. ఎన్నికలొస్తేనే ప్రజల్లోకి కాంగ్రెస్‌

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కలు చెప్పింది విని విమర్శలు చేయడం సరికాదని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి చూస్తే ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు అర్థం అవు తుందని హితవు పలికారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోమటి చెరువులో చేపపిల్లలను వదిలిన అనంతరం రైతుల బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ పాలన కొనసాగుతోంది.

ఈ రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించాలి. గతంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగే వారు. ఇప్పుడు అధికారులే రైతుల చుట్టూ తిరుగుతున్నారు. రైతుల సంక్షేమం కాంక్షించే ఏకైక ప్రభుత్వం తమదే’ అని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. ఎన్నడూ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించని కాంగ్రెస్‌ నాయకులు వర్షాలొస్తే ఉసిల్లు వచ్చినట్లు.. ఎన్నికలొస్తే ప్రజల్లోకి రావడం చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. నాలుగేళ్లుగా అమలవుతున్న ప్రతి పథకం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నంత వరకు అమలు చేస్తామని స్పష్టం చేశారు.  

రానున్నవి మత్స్యకారుల రోజులే.. 
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కాలంతో పనిలేకుండా చెరువులు, కుంటల్లో నీళ్లుంటాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అప్పుడు మత్స్యకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అనంతగిరి సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌ రిజర్వాయర్లతో పాటు, ఇతర ప్రాజెక్టులు జల కళ సంతరించుకుంటాయని చెప్పారు. ప్రతి రిజర్వాయర్‌ పరిధిలో 15 ఎకరాల విస్తీర్ణంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అప్పుడు మనకు కావాల్సిన చేప పిల్లలు ఇక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల తో 21 వేల చెరువులకుగాను 11 వేల చెరువులు నిండాయన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top