ఒక్క ఓటుతో కూటమి తాట తీయండి: హరీష్‌రావు

Harish Rao Comments On Congress Leaders Uttam And Komatireddy - Sakshi

సాక్షి, సిద్దిపేట : టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ములేక కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ పార్టీలకు ఒక్క ఓటుతో బుద్ధి చెప్పాలని ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. జిల్లాలోని ములుగు, మార్కుక్‌ మండలంలో మంగళవారం జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, భూమిరెడ్డి ఎలక్షన్‌రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో హరీష్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలకు కుర్చీల కోసం కొట్లాట తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. తెలంగాణలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసి చూపిందని వెల్లడించారు. 

గతంలో మంత్రులు, అధికారులు గ్రామాల్లోకి వస్తే.. నీటికి కటకట ఉందని ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపేవారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటేస్తామని గుంటిపల్లె ప్రజలంతా తీర్మానం చేశారనీ.. అదే స్ఫూర్తితో యావత్‌ తెలంగాణ ప్రజానీకం టీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలవాలని కోరారు. కోదండరామ్‌ పార్టీ గురించి మాట్లాడడమంటే సమయం వృధా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. కొండపోచమ్మ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోదండరామ్‌ తీవ్రంగా యత్నించాడని ఆరోపించారు. ప్రభుత్వ కృతనిశ్చయంతో నేడు కొండపోచమ్మ ప్రాజెక్టు పనులు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top