‘సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లను అనర్హులగా ప్రకటించాలి’

GVL Narasimha Rao Complaint To Ethics Committee Against Sujana Chowdary - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లను అనర్హులుగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి పైనే దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నందున్న.. ఆయనకు ఎంపీగా కొనసాగే అర్హత లేదన్నారు. టీడీపీ ఎంపీల అవినీతిని చూసి ప్రజలు విస్తుపోతున్నారని విమర్శించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ దాడుల్లో టీడీపీ నేతల అవినీతి బయటపడుతున్నా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా వారిని సమర్థిస్తున్నారని తెలిపారు. తన బినామీలను కాపాడుకునే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయాల్లో విశ్వసనీయత లేదన్నారు. టీడీపీ దొంగల పార్టీ అని​ ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, టీడీపీ నేతలు ఆలీబాబా 40 దొంగల్లా వ్యవహరిస్తున్నారని జీవీఎల్‌ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దొంగిలిస్తే.. సంజాయిషీ అడగకూడదా అని ప్రశ్నించారు. తెలంగాణలో మహాకూటమికి ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్‌తో కలిస్తే ప్రజలు గుడ్డలు ఇప్పి తంతారంటూ టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఇందిరా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని.. కానీ నేడు ఆ పార్టీని చంద్రబాబు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని అన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top