‘కోటి’ కలకలంపై స్పందించిన సీఎం

Narendra_Patel

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్‌లో ‘కోటి’ కలకలం రేగింది. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పీఏఏఎస్) నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు అధికార బీజేపీ చేసిన ప్రయత్నం బట్టబయలు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. బీజేపీ ఇచ్చిన డబ్బుతో పీఏఏఎస్ కన్వీనర్‌ నరేంద్ర పటేల్‌ సోమవారం మీడియాకు రావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ స్పందించారు. పటీదార్ల మద్దతు బీజేపీకే ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుస్తామని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అన్నారు. తమపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, సీఎం విజయ్‌ రూపానీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా భేటీ అయ్యారు. రూ. కోటి లంచం ఆరోపణలు, తాజా పరిణామాలపై చర్చించారు.

తమ పార్టీలో చేరేందుకు బీజేపీ తనకు కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైందని నరేంద్ర పటేల్‌ తెలిపారు. ఇటీవల బీజేపీలో చేరిన హార్దిక్‌ పటేల్‌ సన్నిహితుడు వరుణ్‌ పటేల్‌ ద్వారా తనతో బేరం కుదుర్చుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. అడ్వాన్స్‌గా తనకు రూ. 10 లక్షలు ఇచ్చారని, మిగతా రూ. 90 లక్షలు రేపు ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. వరుణ్‌ పటేల్‌ ఇచ్చిన రూ. 10 లక్షల నగదును మీడియాకు చూపించారు.

నరేంద్ర పటేల్‌ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఇదంతా కాంగ్రెస్‌ కుట్రగా వర్ణించింది. తమ పార్టీలో చేరేందుకు ఆయనే ముందుకు వచ్చారని, రెండుమూడు గంటల తర్వాత ఈ డ్రామాకు తెరతీశారని బీజేపీ అధికార ప్రతినిధి భరత్‌ పాండ్యా అన్నారు. మొత్తం కోటి రూపాయలు తీసుకున్న తర్వాత మీడియాకు ముందుకు రావచ్చు కదా, ముందే ఎందుకు వచ్చారని వరుణ్‌ పటేల్‌ ప్రశ్నించారు. పటేల్‌ కులస్తులంతా బీజేపీ వైపు మొగ్గుచూపుతుండటంతో భయపడిపోయి కాంగ్రెస్‌ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని ఎదురుదాడి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top