
గులాం నబీ ఆజాద్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక రాజకీయం క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. బెంగళూరు రిస్టార్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరింపులకు గురిచేయడంతో వారిని విమానంలో కేరళ తరలించాలనుకున్నామని, అయితే అనుమతి లభించకపోవడంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్ తీసుకువచ్చామన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని అన్నారు. శాసనసభలో బల నిరూపణకు 15 రోజుల పాటు గడువు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇంతవరకు లేదన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బలనిరూపణ కోసం గవర్నర్లు గరిష్టంగా ఏడు రోజుల గడువు మాత్రమే ఇచ్చారని ఆయన గుర్తుచేస్తూ ప్రస్తుత కర్నాటక గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడమంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన దుయ్యబట్టారు.
రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, న్యాయవ్యవస్థపైనే ప్రజలకు విశ్వాసం ఉందని ఆజాద్ అన్నారు. యడ్యూరప్ప లాగే తాము కూడా గవర్నర్‌ను కలిసి, తమకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల జాబితా సమర్పించామని, తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. బలనిరూపణ అనేది తదుపరి అంశమని, ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఏ ప్రాతిపదికన గవర్నర్ ఆహ్వానించారని ఆజాద్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కర్ణాటక గవర్నర్ ఖూనీ చేశారు. కాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెండు బస్సుల్లో నగరంలోని తాజ్ కృష్ణకు తరలించారు. బలనిరూపణ అయ్యేంత వరకూ వారికి ఇదే హోటల్‌లో బస కల్పించనున్నారు.