జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడి నుంచి  చీఫ్‌విప్‌ దాకా..

Gadikota Srikanth Reddy Appointed To AP State Chief WHIP - Sakshi

రాయచోటి : రైతు కుటుంబానికి చెందిన రాజకీయ నేత లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి వారసునిగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వారి మనసులో చోటు సంపాదించుకున్నారు. ఉన్నత చదువులు చదివి, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేçస్తున్నా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, దివంగత నేత వైఎస్సార్‌ స్ఫూర్తే తనను రాజకీయాల్లోకి రప్పించిందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెబుతుంటారు. 2006లో కడప జిల్లా యువజన కాగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత సమస్యలను తెలుసుకోవడం కోసం 2007లో జిల్లా వ్యాప్తంగా 500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీటి వనరులు వాటి ఆవశ్యకత, ఇతర సమస్యలపై పూర్తిస్థాయిలో అవగానను పెంచుకున్నారు.

ఎమ్మెల్యేగా...
లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం 2009 ఎన్నికల ముందు రద్దయింది. రాయచోటి నియోజకవర్గంలో విలీనమైంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్ల విషయంలో పోటీ ఉన్నప్పటికీ యువజన కోటాలో దివంగత నేత వెఎస్సార్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి టిక్కెట్‌ను దక్కించుకున్నారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజకీయ దిగ్గజం సుగువాసి పాలకొండ్రాయుడిపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శ్రీకాంత్‌రెడ్డి పోటీ చేశారు. 15వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్‌ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చారు. శ్రీకాంత్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జెడ్పీ మాజీ చైర్మన్‌ సుగువాసి సుబ్రహ్మణ్యంపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శ్రీకాంత్‌రెడ్డి పోటీ చేసి 57వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. 2014 జమిలి ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డిపై పోటీ చేసి 36వేల ఓట్లతో గెలుపొంది హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డిపైనే పోటీ చేసి 33వేల ఓట్ల మెజార్టీతో నాలుగో విజయాన్ని అందుకుని రాయచోటి రాజకీయ చరిత్రను తిరగరాశారు.
 
 రాజకీయాల్లో చురుకైన పాత్ర...
 పార్టీ అధినేతకు శ్రీకాంత్‌రెడ్డి దగ్గరగా, నమ్మకస్తుడుగా ఉంటూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఫలితంగా రాయచోటి స్థానం నుంచి నాలుగు పర్యాయాలు టిక్కెట్‌ను దక్కించుకుని వైఎస్సార్‌ కుటుంబం ఆశీస్సులతో విజయాలను అందుకుంటూ వచ్చారు. 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు రాయచోటి స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా శ్రీకాంత్‌రెడ్డి గెలుపొంది రికార్డు నెలకొల్పారు.

కష్టకాలంలో వైఎస్‌ జగన్‌ వెంటే...
కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు రావడంతో అందరికంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి శ్రీకాంత్‌రెడ్డి. జగన్‌ ఓదార్పు యాత్ర, పాదయాత్రల వెన్నంటే నడిచారు. అసెంబ్లీలో జగన్‌కు చేదోడు వాదోడుగా నిలిచి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడంలో సఫలీకృతులయ్యారు.రాజకీయ ప్రత్యర్థులలో సింహస్వప్నంగా నిలిచారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

 విజయాలు...
నియోజకవర్గంలో వెలిగల్లు, ఝరికోన, శ్రీనివాసపురం ప్రాజెక్టుల మంజూరుతో పాటు వాటి నిర్మాణంలో శ్రీకాంత్‌రెడ్డి పాత్ర ప్రశంసనీయం. వెలిగల్లు నీటిని రాయచోటి పట్టణానికి అందించి తాగునీటి కొరతను తీర్చారు. అలాగే రోళ్లమడుగు నీటి పథకం ద్వారా పట్టణ సమీపంలోని చెన్నముక్కపల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలలోన్ని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించారు. గాలివీడు పట్టణానికి కూడా వెలిగల్లు ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. రాయచోటి పట్టణంలో రింగ్‌రోడ్డు నిర్మాణం, ప్రభుత్వ పాలిటెక్నిక్, బాలికల జూనియర్‌ కళాశాల, మైనారిటీ హాస్టళ్లు, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కస్తూర్బా, మోడల్‌ స్కూల్స్‌ మంజూరు, పట్టణంలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు జాతీయ రహదారిలో డివైడర్స్‌ ఏర్పాటు, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు, పలు అభివృద్ధి పనుల మంజూరులో ఎమ్మెల్యే పాత్ర అభినందనీయంగా చెప్పుకోవచ్చు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top