రణమా... శరణమా!

Gaddam Vivekanada Disappoints With KCR Decision - Sakshi

పెద్దపల్లి టికెట్‌ దక్కకపోవడంతో వివేక్‌ అంతర్మథనం

నేడు ఎన్‌టీపీసీలో అనుయాయులతో సమావేశం 

సాక్షి, ఆదిలాబాద్‌: సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నాయకుడిగా వ్యవహరించిన దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) వారసత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపార రంగంలో ఉంటూ వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ఎంపీ అయిన గడ్డం వివేకానంద్‌ కేవలం ఐదేళ్లు మాత్రమే ఎంపీగా కొనసాగారు. రాజకీయంగా నిలకడ లేని నిర్ణయాలతో ఇబ్బందిపడిన వివేకానంద టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన షాక్‌తో అయోమయానికి గురయ్యారు. కేసీఆర్‌ గురువారం ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో వివేక్‌కు చోటు దక్కలేదు. ఈ జాబితాలో గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరపున చెన్నూరు నుంచి పోటీకి దిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ చేతిలో 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేశ్‌ నేతను అదృష్టం వరించింది.

దీంతో వివేకానంద్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాకా వారసుడిగా వచ్చిన వివేక్‌ పదేళ్లలోనే ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి రాజకీయంగా పతనం అంచులకు చేరడాన్ని వెంకటస్వామి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్‌పై సన్నిహితులతో చర్చించిన వివేక్‌ శనివారం ఉదయం 11 గంటలకు ఎన్‌టీపీసీలోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివేక్‌ వర్గీయులు, కాకా అభిమానులను సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో వచ్చే సూచనలకు అనుగుణంగా భవిష్యత్‌ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

సుమన్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేల ప్రణాళిక
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్‌లోనే పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల పరిధిలో ముసలం పుట్టిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లను ఓడించేందుకు వివేక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులతో కుమ్మక్కయ్యారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో ఉభయ తారకంగా కాంగ్రెస్‌ నేతలతోనూ ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించారని కేసీఆర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక వివేక్‌ అండతోనే ఆయన సోదరుడు వినోద్‌ ఏకంగా బీఎస్‌పీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఓటమికి ప్రయత్నించారని ప్రభుత్వ నిఘావర్గాలు సమాచారాన్ని చేరవేశాయి. ఈ నేపథ్యంలో గత జనవరి నుంచే వివేక్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ముందు పెట్టి చెన్నూరు  ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పావులు కదిపారు.

వీరికి మిగతా ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో కేసీఆర్‌ పెద్దపల్లి సీటు పోటీ నుంచి వివేక్‌ను తప్పించారు. అయితే తనపై ఓడిపోయిన వెంకటేష్‌ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి టికెట్‌ ఇప్పించడంలో కూడా బాల్క సుమన్‌ పాత్రే కీలకం. సామాజిక సమీకరణాల పేరుతో నేతకాని వర్గానికి చెందిన దుర్గం చిన్నయ్య ద్వారా మంత్రాంగం నడిపించారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉండి వివేక్‌ స్థానంలో వెంకటేశ్‌కు సీటు ఇవ్వాలని కోరడంతో వారి మాటకు విలువిచ్చిన కేసీఆర్‌ వెంకటేశ్‌ను పెద్దపల్లి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, మంచిర్యాల గ్రంథాలయసంస్థ చైర్మన్, వెంకటేశ్‌ నేత ఎన్నికల ఏజెంట్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ కలెక్టరేట్‌కు వెళ్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటేశ్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేశారు. ఈనెల 25న వేలాది మందితో ర్యాలీగా వచ్చే వెంకటేష్‌ మరో సెట్‌ నామినేషన్‌ వేయనున్నట్లు సుమన్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

తక్షణ కర్తవ్యం?
పెద్దపల్లి ఎంపీ టికెట్‌ హామీతోనే రెండుసార్లు టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తనకు అన్యాయం జరిగిందని వివేక్‌ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. చెన్నూరులో బాల్క సుమన్‌ను ఓడించడానికి వెంకటేశ్‌ నేతకు తాను సహకరించానని ప్రచారం చేస్తున్న సుమన్‌.. అదే వెంకటేశ్‌కు ఇప్పుడు టికెట్‌ ఎలా ఇప్పిస్తారని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. పెద్దపల్లిలో తనను రాజకీయంగా బలిపశువును చేయాలనే ఈ కుట్రకు తెరలేపారని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఎలాంటి అడుగు వేయాలనే దానిపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు.

2013లో తండ్రి వెంకటస్వామి చెప్పినా వినకుండా టీఆర్‌ఎస్‌లో చేరడం, 2014 ఎన్నికల్లో తనకు ఎంపీ సీటు ఇచ్చినా చెన్నూరు సీటును సోదరుడు వినోద్‌కుమార్‌కు ఇవ్వని కారణంగా పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం, ఆ తర్వాత 2017లో మరోసారి టీఆర్‌ఎస్‌లోకి రావడం ప్రతిష్టకు భంగం కలిగించాయని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడు వినోద్‌ బీఎస్‌పీ తరఫున పోటీ చేయడం తన రాజకీయ భవిష్యత్‌కు గొడ్డలిపెట్టుగా మారిందని కూడా ఆయన కొందరు నాయకుల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం. ఈ పరిస్థితుల్లో మరోసారి పార్టీ మారి వేరే గుర్తు మీద పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే అంశంపై ఆయన దృష్టి సారించారు. ఈ మేరకు శనివారం జరగనున్న సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. 

ఎదురుచూపుల్లో బీజేపీ
టీఆర్‌ఎస్‌లో పెద్దపల్లి టికెట్‌పై ఊహాగానాలు వస్తున్న సమయంలో బీజేపీ అప్రమత్తమైంది. పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే వివేక్‌తో మాట్లాడగా.. ఆయన పార్టీ మారే విషయమై స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. గతంలో కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు టీఆర్‌ఎస్‌లోకి రావడం, వినోద్‌ 2018లోనే మరో సారి పార్టీ మారి నగుబాటుకు గురైన నేపథ్యంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిసిం ది. కాగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ వివేక్‌ను ఢిల్లీకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడొకరు తెలిపారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులను పరిశీలిస్తే వివేక్‌ బీజేపీ నుంచి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన పేర్కొనడం గమనార్హం. కాగా వివేక్‌ బీజేపీ తరఫున పోటీకి నిరాకరిస్తే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా మాల సామాజిక వర్గానికే చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కుమార్, దళితమోర్చా రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు.
 
ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా
పెద్దపల్లి నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కక పోవడంతో వివేక్‌ రాష్ట్రప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తాననే హామీతోనే టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించా రు. తెలంగాణ సాధన క్రమంలో నా చురుౖకైన భాగస్వామ్యానికి మెచ్చి పార్టీలోకి తీసుకున్నారు. కానీ నాకు ఇచ్చిన హామీ మేరకు టికెట్‌ ఇవ్వలేదు.  నేను ఆ హోదాలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదు. నా రాజీనామాను ఆమోదించగలరు’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.          

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top