మరో ఐదు ప్రశ్నలు సంధించిన కన్నా

Five More Questions To Chandrababu Naidu From Kanna - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో మారు ఐదు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర సమస్యలు, ప్రభుత్వ అవినీతిపై ఇప్పటివరకు రెండు దఫాలుగా 10 ప్రశ్నలు సంధించారు. కన్నా ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటికీ మరోసారి బుధవారం 5 ప్రశ్నలను విడుదల చేశారు. వీటిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

కన్నా సంధించిన ఐదు ప్రశ్నలు

మొదటి ప్రశ్న: అప్పుడెప్పుడో చక్రవర్తులు దేశాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లు, ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని సింగపూర్‌కు దోచిపెట్టడం లేదా? రాజధాని భూకుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా?
మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుంచి తీసుకుని, అందులో 1691 ఎకరాల భూమిని స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో సింగపూర్‌ సంస్థలకు అప్పగించారు. ఇందులో మెజార్టీ వాటా 58 శాతం
సింగపూర్‌ సంస్థలకు, 42 శాతం రాష్ట్రానికి వచ్చే విధంగా ఒప్పందం కుదిర్చారు. అందులో రోడ్లు, నీరు, కరెంటు వంటి  మౌళిక వసతులు ప్రభుత్వమే కల్పించి ఇచ్చే విధంగా మీరు చేసుకున్న ఒప్పందం రాష్ట్రాన్ని
సింగపూర్‌ సంస్థలకు దోచిపెట్టడం కాదా? ఇంత అన్యాయపు ఒప్పందం ఎక్కడైనా ఉంటుందా?

రెండో ప్రశ్న: రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చిన మీరు సీఎంగా కొనసాగేందుకు నైతిక అర్హత ఉందా? రాష్ట్ర విభజన సమయానికి రూ.లక్ష కోట్లు ఉన్నఅప్పుని, విభజన తర్వాత రూ.2.35 లక్షల కోట్లకి తీసుకెళ్లిన ఘనత మీది కాదా? 

మూడో ప్రశ్న: మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు బాధ్యులు కారా? మూడు సంవత్సరాల క్రితం మీ ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది అమాయకుల భక్తుల ప్రాణాలు పోవడానికి ఎందుకు కారణం అయ్యారు? మీ వనం-మనం కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకుని, విద్యార్థులను తరలించి ఉన్నట్లయితే ఐ.పోలవరం దగ్గర అమాయక విద్యార్థులు మరణించేవారు కాదు కదా? ఈ మరణాలన్నీ మీ వల్ల జరిగిన హత్యలుగా ఎందుకు పరిగణించకూడదు?

నాలుగో ప్రశ్న: ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది మీరు కాదా? ప్రత్యేక హోదా బదులు అవే సదుపాయాలతో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్ర అసెంబ్లీ చేత తీర్మానం చేయించి కేంద్రానికి పంపింది మీరు కాదా? రాజ్యాంగ పరమైన ఒక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి మరల ప్రత్యేక హోదా అడగటం కేంద్రాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించటం కాదా? ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు, మరల అసెంబ్లీలో ‘ప్యాకేజీ వద్దు - హోదానే కావాలి’  అనే తీర్మానాన్ని ఎందుకు చేయించలేదు?

ఐదో ప్రశ్న: వేలకు వేల రహస్య జీవోలను జారీ చేసిన ప్రభుత్వానికి పారదర్శకత ఎక్కడ ఉంది? పారదర్శక పరిపాలన అందిస్తున్నామని, రేయింబవళ్లు చెప్పే మీరు రహస్య జీవోలను ఇచ్చే విషయంలోనే రికార్డు సాధించలేదా? అసలు రహస్య జీవోలను జారీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కేవలం అవినీతి, అశ్రిత పక్షపాతం కోసం కాదా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top