రైతుల ప్రథమ శత్రువు సీఎం కేసీఆర్‌

Farmers' first enemy CM KCR - Sakshi

డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

నేరడిగొండ(బోథ్‌) ఆదిలాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు ప్రథమ శత్రువని డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని వడూర్‌లో గురువారం ఆత్మహత్య చేసుకున్న రైతు గాదె రవి కుటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

రైతుల పక్షాన నిలబడి పోరాడేది ఒక కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్‌ రైతు వ్యతిరేక విధానాలను వీడకపోతే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 2015 నుంచి నేటివరకు అతివృష్టి, అనావృష్టితో పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. విశ్వాసం కోల్పోయిన కేసీఆర్‌ రైతుబంధు పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల ఉసురు తగలక మానదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షలు రైతు రుణమఫీని ఏకకాలంలో చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా ప్రణాళికలు రూపొందించి రైతుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీని ఏర్పాటు చేస్తామన్నారు.

ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్‌ అనిల్‌కుమార్, బోథ్‌ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు మల్లెపూల సత్యనారాయణ, నాయకులు షబ్బీర్‌ అహ్మద్, ఆదుముల్ల భూషన్, ఫయ్యాజ్, సుభాష్‌గౌడ్, భీంరెడ్డి, సదానందం, రాజశేఖర్‌రెడ్డి, ఎండి సద్దాం, తదితరులు ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top