పవన్‌ ఓదార్పు కోసం ఎదురు చూపులు | Sakshi
Sakshi News home page

నట్టేట నాయకులు

Published Fri, May 31 2019 9:32 AM

Fans And Janasena Activist Worried About Pawan Kalyan Lost - Sakshi

పశ్చిమగోదావరి ,భీమవరం : ‘పవన్‌ అభిమానులు కోకొల్లలు.. సినిమా చర్మిషాతో విజయం సాధిస్తాం.. 1983లో ఎన్టీ రామారావుకు ఉన్న ఫాలోయింగ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కూ ఉంది. గ్రామస్థాయిలో జనసేన పార్టీకి బలం లేకపోయినా, కమిటీలు లేకపోయినా పార్టీకి సభ్యత్వాలు లేకపోయినా జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు నల్లేరుపై నడకే’.. ఇది ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు జనసైనికుల ధీమా. అయితే ఈనెల 23న  ఫలితాలు వచ్చాక జనసేనాని పవన్‌కల్యాణ్‌ బొక్కబోర్లాపడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ చేతిలో ఘోరపరాజయం పాలుకావడంతో జిల్లాలోని జనసైనికులు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. పవన్‌ నుంచి ఓదార్పుకోసం ఎదురుచూస్తున్నారు.

అగమ్యగోచరంగా జనసేన భవిష్యత్‌
ప్రధానంగా భీమవరం నియోజకవర్గంలోని పార్టీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జనసేన పార్టీ తరఫున పోటీచేయడానికి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త డాక్టర్‌ యిర్రింకి సూర్యారావు, వేగేశ్న సూర్యనారాయణరాజు (కనకరాజుసూరి) బొమ్మదేవర శ్రీధర్‌ (బన్ను) బిల్డర్‌ మల్లినీడి తిరుమలరావు(బాబి), న్యాయవాది ఉండపల్లి రమేష్‌నాయుడు వంటివారు ఆశించారు. దీనికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఎన్నికలు సమీపించిన తరుణంలో అప్పటికప్పుడు జనసేనాని పవన్‌కల్యాణ్‌ భీమవరంలో పోటీకి సిద్ధపడ్డారు. భీమవరం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున కాపు ఓట్లతో పాటు పపన్‌ అభిమానులు పవన్‌ను గెలిపిస్తారనే నమ్మకంతో పోటీ చేయించారు. అయితే ఎన్నికల ప్రచారంలో పవన్‌ మొక్కుబడి ప్రచారం చేయడమేగాక పోలింగ్‌ రోజు నియోజకవర్గం ఓటర్లకు కనుచూపుమేరలో కన్పించలేదు. అయినప్పటికీ పవన్‌ చరిష్మాతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అనేకమంది కోట్లాది రూపాయలు పందాలు కాశారు. సామాన్యప్రజలు, చిరు వ్యాపారులు, రైతులు సైతం అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పందాలు వేశారు.

అధినేత ఓటమిపై కార్యకర్తల్లో కలత
ఓట్ల లెక్కింపులో టీడీపీ మెజార్టీతో ప్రారంభం కాగా తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ  ఆధిక్యత కనబర్చగా మధ్యలో కొన్ని రౌండ్లు జనసేన ఆధిక్యత కనబర్చింది. దీంతో పవన్‌కల్యాణ్‌ విజయం ఖాయమంటూ పార్టీ శ్రేణులు అప్పటికే సంబరాలు ప్రారంభించారు. చివరకు ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ప్రధానంగా జనసేన పార్టీ  నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భీమవరంలో తన విజయం కోసం కృషి చేసిన వారి గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడంతో వారితో అంతర్మథనం ప్రారంభమైంది.

పార్టీ కోసం, పవన్‌ విజయం కోసం అహర్నిశలు శ్రమించాం. తీరా ఓటమి పాలవడంతో రానున్న రోజుల్లో మాకు ఎవరు అండగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. జనసేనను నమ్ముకుని తెలుగుదేశం పార్టీని, మునిసిపల్‌ చైర్మన్‌ పదవిని వదులుకున్న కొటికలపూడి గోవిందరావు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయిన పవన్‌ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎలా పోరాటం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పవన్‌ను నమ్ముకున్నవారికి జిల్లాలో పెద్దదిక్కుగా ఉండే నాథుడే కరువయ్యాడని, ప్రధానంగా భీమవరంలో మా అలనాపాలనా చూసే నాథుడు లేనందున మా పరిస్థితి ఏమిటని జనసేన నాయకులు అంతర్మథనంలో ఉన్నారు. మొత్తం మీద జనసైనికులంతా తలోదిక్కుకూ వెళ్లే ఆలోచనలో ఉన్నా తమను ఆదరించేవారెవరనే సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement