‘ఎవరి అభిమానో త్వరలోనే తెలుస్తుంది’

Ex MP Undavalli Arun Kumar Slams Chandrababu Over Polavaram Project - Sakshi

రాజమండ్రి:  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆనందం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉండవల్లి విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత బాబు ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిందితుడికి నార్కో టెస్టు చేయిస్తే నిజాలు బయటకొస్తాయన్నారు. వైఎస్సార్‌ కుటుంబానికి డ్రామాలంటే ఇష్టం ఉండదని ఉండవల్లి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ బాధ్యత లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. అసలు జగనే కావాలనే చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. కావాలనే హత్యాయత్నం చేయించుకోవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఆ అభిమాని ఏ పార్టీకి చెందినవాడో త్వరలోనే తెలుస్తుందన్నారు.

ఇంకా మట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తయిందని ప్రకటించారు...అది కాస్తా వర్షాలకు కొట్టుకుపోయిందని మళ్లీ చెప్పారని వెల్లడించారు. టీడీపీ అనుకూల పేపరైన ఈనాడులోనే దీనిపై కథనం కూడా వచ్చింది. జెట్‌ గ్రౌటింగ్‌ అసలు అంచనాల్లోనే లేదు..ఎంత చెల్లించాలో కూడా తెలియదని చెప్పింది. పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్లు ఎంత చెబితే అంత చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పోలవరం విషయంలో బిల్లులు అసలు కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారని ముందే చెప్పాను..అదే విషయం కాగ్‌ తేల్చింది. 2019లో మే నాటికి నీరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే మేలో నీరుండదు. నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని ఉండవల్లి తెలిపారు.

అధిక సొమ్ము ఇచ్చి పనిచేయిస్తున్నప్పుడు నాణ్యత విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారని ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలన్నీ తాత్కాలికమేనని, శాశ్వత కట్టడం ఒక్కటి కూడా లేదని తెలిపారు. ఆఖరికి హైకోర్టు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కూడా ఈ తాత్కాలిక భవనాలు నిర్మించేటపుడు టీడీపీని అడగలేదని చెప్పారు. ఇవన్నీ కూడా టీడీపీ, బీజేపీలు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలేనని చెప్పారు. రాజకీయం కూడా ఓ వృత్తిలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top