breaking news
undavalli arun kuramar
-
వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగితే బాబుకు ఆనందం ఎందుకు
-
‘ఎవరి అభిమానో త్వరలోనే తెలుస్తుంది’
రాజమండ్రి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆనందం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉండవల్లి విలేకరులతో మాట్లాడుతూ.. జగన్పై హత్యాయత్నం జరిగిన తర్వాత బాబు ప్రెస్మీట్లో నవ్వుతూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిందితుడికి నార్కో టెస్టు చేయిస్తే నిజాలు బయటకొస్తాయన్నారు. వైఎస్సార్ కుటుంబానికి డ్రామాలంటే ఇష్టం ఉండదని ఉండవల్లి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ బాధ్యత లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. అసలు జగనే కావాలనే చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. కావాలనే హత్యాయత్నం చేయించుకోవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఆ అభిమాని ఏ పార్టీకి చెందినవాడో త్వరలోనే తెలుస్తుందన్నారు. ఇంకా మట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జెట్ గ్రౌటింగ్ పూర్తయిందని ప్రకటించారు...అది కాస్తా వర్షాలకు కొట్టుకుపోయిందని మళ్లీ చెప్పారని వెల్లడించారు. టీడీపీ అనుకూల పేపరైన ఈనాడులోనే దీనిపై కథనం కూడా వచ్చింది. జెట్ గ్రౌటింగ్ అసలు అంచనాల్లోనే లేదు..ఎంత చెల్లించాలో కూడా తెలియదని చెప్పింది. పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్లు ఎంత చెబితే అంత చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పోలవరం విషయంలో బిల్లులు అసలు కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారని ముందే చెప్పాను..అదే విషయం కాగ్ తేల్చింది. 2019లో మే నాటికి నీరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే మేలో నీరుండదు. నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని ఉండవల్లి తెలిపారు. అధిక సొమ్ము ఇచ్చి పనిచేయిస్తున్నప్పుడు నాణ్యత విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారని ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలన్నీ తాత్కాలికమేనని, శాశ్వత కట్టడం ఒక్కటి కూడా లేదని తెలిపారు. ఆఖరికి హైకోర్టు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కూడా ఈ తాత్కాలిక భవనాలు నిర్మించేటపుడు టీడీపీని అడగలేదని చెప్పారు. ఇవన్నీ కూడా టీడీపీ, బీజేపీలు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలేనని చెప్పారు. రాజకీయం కూడా ఓ వృత్తిలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏకాభిప్రాయం లేక మెజార్టీ అభిప్రాయంతోనే రాష్ట్రాల ఏర్పాటు
రాజమండ్రి: ఇప్పటి వరకు ఏకాభిప్రాయం, మెజార్టీ అభిప్రాయంతోనే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో ప్రతి నిమిషాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. సభలో ఇంతమంది వ్యతిరేకించారు, ఇంతమంది మద్దతు పలికారు అనేది స్పష్టంగా తెలియాని చెప్పారు. చర్చలో అన్ని అంశాలు చర్చకు రావాలన్నారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాతే రాష్ట్రాల విభజన జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాతే రెండు రాష్ట్రాలు విలీనం అయ్యాయన్నారు. గతంలో కమిషన్ ద్వారా గానీ, అసెంబ్లీ తీర్మానం ద్వారా గానీ రాష్ట్రాల విభజన జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశం పార్టీలకు సంబంధించినది కాదన్నారు. పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని చూడాలని చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన రీతిలో విభజన జరగాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయం గుర్తు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న సిడబ్ల్యూసిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక్క సభ్యుడు కూడా లేరని తెలిపారు. రాష్ట్ర విభజనతో ఇతర రాష్ట్రాలలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.