'రాష్ట్రమంతా హుజూర్‌నగర్‌ వైపే చూస్తోంది'

Everyone In The State Looking At Huzurnagar By Election - Sakshi

సాక్షి, సూర్యాపేట: రాష్ట్రమంతా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక వైపే చూస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికల్లో ఎప్పుడూ జయమే లభించిందని అన్నారు. నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయమే ఇందుకు నిదర్శనమన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలను ఎవ్వరు నమ్మరని వ్యాఖ్యానించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైదిరెడ్డిని గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని తమకు వచ్చిన సర్వే రిపోర్ట్‌లో తేలిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో అనేక రాష్ట్రాలకు తెలంగాణ మోడల్‌గా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తాయని చెప్పారు.

రైతులకు, పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కోటి ఎకరాల మాగాణికి నీరు అందించే దిశగా కేసీఆర్ ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. అంతేకాక రైతు రుణమాఫీని కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తమ్‌ నీతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ అభ్యర్థి సైదిరెడ్డి స్వస్థలం గుండ్లపల్లి అయితే నాన్‌ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాక కేటీఆర్‌ను 'బచ్చా' అని ఉత్తమ్‌ సంబోధించడం బాగాలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన కేటీఆర్‌ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని అభిప్రాయపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top