ఇంగ్లీష్‌ మీడియంపై ప్రముఖంగా ప్రశంసలు!

Education Minister Suresh, who introduced the School Education Regulation And Supervision Bill Into the Assembly - Sakshi

జాతీయ, అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాశాయి

ఇంగ్లీష్‌ ప్రపంచ భాష.. తెలుగు ఔన్నత్యాన్నీ కాపాడుతాం

అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి, విద్యను వ్యాపారంగా మార్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ప్రవేశపెట్టిన పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ-2019 బిల్లును సభ మధ్యాహ్నం ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చ గురించి మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరిస్తూ.. బిల్లు పరిధిలోకి జూనియర్‌ కాలేజీలు కూడా వస్తాయని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు నష్టపోయాయని, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల కంటే, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండడమే దానికి నిదర్శనమన్నారు. మరోవైపు ప్రైవేటు సెక్టార్‌లో కూడా విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదికాక, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ఆవశ్యకత - నాడు, నేడు అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌ ప్రపంచ భాష అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్‌ మీడియం నిర్ణయం పట్ల ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రశంసిస్తూ కథనాలు రాశాయని సభ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో 90 శాతం ఆంగ్ల మాధ్యమం ఉంటే, ప్రభుత్వ పాఠశాలల్లో 35 శాతంలోపే ఉన్నాయని తెలిపారు. అధిక ఫీజులు ఇత్యాది కారణాల వల్ల పేదవారు, దళితులు, అగ్రవర్ణ పేదలు ఆంగ్ల విద్యకు దూరమయ్యారని వివరించారు. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దశాబ్దంపైగా పెండింగ్‌లో ఉన్న తెలుగు పండిట్ల అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియను తమ ప్రభుత్వం చేపట్టిందని, వారందరికీ స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ ఇచ్చామని గుర్తు చేశారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలుగు అకాడమీని ఏర్పాటు చేశాం​. మీరెందుకు చేయలేదు? అని నిలదీశారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో ఉన్న 216 స్కూళ్లను కూడా నాడు - నేడు కార్యక్రమం కింద మౌలిక వసతులు కల్పించబోతున్నామని వెల్లడించారు. సమాజ భవిష్యత్తు పట్ల సామాజిక శాస్త్రవేత్తలా ఆలోచించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top