మంత్రి లోకేష్‌ కోసం ‘దురాయి’

durayi instructions for nara lokesh program - Sakshi

కావలి: కావలి రూరల్‌లోని తుమ్మలపెంట బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీడీపీ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని మత్స్యకార గ్రామాల్లో ‘దురాయి’ విధించారు. దురాయి అంటే ‘మత్స్యకార గ్రామంలోని కాపులుగా ఉన్న వారు ఒక మాట చెబితే ఆ మాట మీదనే గ్రామస్తులందరూ కట్టుబడి ఉండాలి. దానిని ఉల్లంఘిస్తే నగదు జరిమానాలతో పాటు ఇతరత్రా చర్యలు ఉంటాయి.’ మండలంలోని మత్స్యకార గ్రామాలకు తుమ్మలపెంట జంక్షన్‌ పాయింట్‌. అక్కడ జరిగే జన్మభూమిలో వేలాది మంది మత్స్యకారులను పాల్గొనేలా చేసి, మంత్రి లోకేష్‌ వద్ద మార్కులు కొట్టేయాలనేది నేతల వ్యూహం. ఇందుకు మత్స్యకారుల్లో ఉన్న దురాయి అనే సాంఘిక దురాచార అస్త్రాన్ని నేతలు ఉపయోగించారు. మండలంలోని తుమ్మలపెంట, అన్నగారిపాలెం, పెద్దపట్టపుపాలెం గ్రామ పంచాయతీల పరిధిలో 25 మత్స్యకార గ్రామాలున్నాయి. వీటిలో 15 గ్రామాల్లో దురాయి వేయించారు.

కచ్చితంగా పాల్గొనాల్సిందే...  
కావలి పట్టణంలోని మద్దూరుపాడు వద్ద ఉన్న పారిశ్రామికవాడలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ల మంత్రి లోకేష్‌ కార్యక్రమంలో లబ్ధిదారులను హాజరుకావాల్సిందేనని టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారు. హాజరు కాకపోతే లబ్ధిదారుల జాబితాలో పేర్లు తొలిగిస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అలాగే రెండో విడతలోని అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉండాలంటే మంత్రి కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అంటున్నారు. ఇక పొదుపు గ్రూపు మహిళలు పాల్గొంటేనే వారికి ప్రభుత్వం ద్వారా అన్ని అందేలా చేస్తామని, ప్రత్యేక రుణాలు మంజూరు చేయిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. రాకపోతే ఆ సంఘాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా ఏవీ రాకుండా ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చుతామని హామీ ఇచ్చీ.. నేటికీ  అమలు చేయలేదని వైజాగ్‌లో మత్స్యకారులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారు చంద్రబాబును కలిస్తే ‘ఆందోళనలు చేస్తే మీ మత్స్యకారుల ఊర్లకు రోడ్లు వేయను’ అంటూ హెచ్చరించారు.  ఈ వ్యవహారంతో మత్స్యకారుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top