బాబు మోసపూరిత హామీలను నమ్మొద్దు: విజయమ్మ | Sakshi
Sakshi News home page

బాబు మోసపూరిత హామీలను నమ్మొద్దు: విజయమ్మ

Published Thu, Apr 4 2019 1:06 PM

Do not Believe in Chandrababu, YS Vijayamma Call For People - Sakshi

సాక్షి, ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) : ఈ ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, ఈసారి తప్పకుండా విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని, మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రజలను కోరారు. మీ భవిష్యత్తు.. నాదేనని చంద్రబాబు ఎన్నికల సమయంలో అంటున్నారని, మోసపూరిత హామీలు ఇస్తున్న చంద్రబాబును నమ్మొద్దు అని ప్రజలను అభ్యర్థించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్‌ విజయమ్మ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి.. ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రరావును భారీ మెజారిటీతో గెలిపించాలని, వైఎస్సార్‌ సంక్షేమ పాలన మళ్లీ కావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరముందని అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ఐదేళ్ల  పాలనలో జరిగిన మోసాలు, దారుణాలు వివరించారు. పసుపు-కుంకుమ పేరిట పోస్టు డేటెడ్‌ చెక్కులు ఇచ్చి చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారని, ఆయనను నమ్మవద్దని మహిళలను కోరారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేశారని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. కనీసం ఐదేళ్లుగా మహిళల రుణాలకు సంబంధించిన వడ్డీలు కూడా కట్టలేదని, దీంతో మహిళలు మరింత అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ భవిష్యత్‌.. నా భద్రత అంటున్నారని, ఎన్నికల సమయంలో అన్న అంటూ ముందుకొస్తున్న ఆయనను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రైతులను నిండాముంచారని, రుణమాఫీ చేస్తానని  నమ్మించి మోసం చేశారని, దీంతో ఇప్పుడు రైతులకు బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. నదులల్లో ఇసుకను కూడా టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారన్నారని తెలిపారు. ప్రతి పల్లెలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ హయాంలో పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు వంటి ఉన్నత చదవులు చదివారని, కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. నిరుద్యోగు భృతి ఇస్తానని నిరుద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.  వైఎస్సార్‌ కలలు కన్న పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఇప్పటికీ పూర్తి చేయలేదని, రాజశేఖర్‌రెడ్డి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తయి ఉండేదని అన్నారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను అమాంతం పెంచి.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 


వ్యవసాయాన్ని వైఎస్సార్‌ పండుగ చేశారు
విజయమ్మ మాట్లాడుతూ.. దివంగత మహానేత, ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనను గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్సార్‌ పరిపాలించారని, ఆయన హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేశారని గుర్తుచేశారు. లక్ష ఎకరాలకు వైఎస్సార్‌ సాగునీరు అందించారని తెలిపారు. ఆరోగ్య శ్రీ  ద్వారా పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని వైఎస్సార్‌ అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. అర్హులైన వారందరికీ వైఎస్సార్‌ పింఛన్‌ అందజేశారని, ఆరోగ్య శ్రీతో చిన్నపిల్లల గుండెలకు భరోసానిచ్చారని తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా వైఎస్సార్‌ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందజేశారని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని తపనపడిన నేత ఆయన అని అన్నారు.

ఇచ్చిన మాట కోసం..
వైఎస్సార్‌ మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారని, కానీ ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర  కాంగ్రెస్‌ వాళ్లకు నచ్చలేదని అన్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడంతో వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టి బెదిరించారని, వేధించారని గుర్తు చేశారు. ప్రజలే తన కుటుంబంగా వైఎస్‌ జగన్‌ భావించారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఆయన ప్రతిస్పందించారని, గత 9 ఏళ్లుగా ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నారని అన్నారు. సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు వైఎస్‌ జగన్‌ తెలుసుకున్నారని తెలిపారు.  

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే.. పేదవాడి చదువుకు అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంటుతోపాటు వసతి, భోజనం కోసం విద్యార్థులకు ఏటా రూ. 20 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామసచివాలయం ద్వారా పదిమందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళల రుణాలను నాలుగు విడతలుగా తీరుస్తామని, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ ఖర్చు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుందని, రూ. వేయి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని తెలిపారు. వైఎస్సార్‌ చేయూత కింద రూ. 75 వేలు అందిస్తామన్నారు.

Advertisement
Advertisement