దామోదర్‌రెడ్డి బాధపడుతున్నారు

Dk aruna commented over nagam janardan reddy  - Sakshi

కాంగ్రెస్‌లోకి నాగం చేరికపై మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలోకి మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని చేర్చుకున్నందుకు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బాధపడుతున్నారని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. నాగంను పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా దామోదర్‌రెడ్డి పార్టీ మారుతున్నారని, ఆయనను టీపీసీసీ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో గురువారం మీడియాతో అరుణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దామోదర్‌రెడ్డిని కలసి పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరానన్నారు. నాగం చేరిక విషయంలో వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని టీపీసీసీ నేతలకు సూచించానని, అయినా దామోదర్‌రెడ్డితో మాట్లాడకుండానే నాగంను పార్టీలో చేర్చుకున్నారన్న దానిపై ఆయన బాధపడుతున్నారని చెప్పారు. పార్టీ మారడం వల్ల అటు పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా నష్టం వస్తుందని దామోదర్‌రెడ్డికి వివరించినట్లు వెల్లడించారు.  

నాగం టీడీపీలోనే బలమైన నాయకుడు..
నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలోనే బలమైన నాయకుడని, కాంగ్రెస్‌లో కాదని అరుణ వ్యాఖ్యానించారు. బలమైన నాయకులైతే అక్కడే గెలవాలి కదా అని ప్రశ్నించారు. నాగం పార్టీలో చేరేటప్పుడే రాహుల్‌కు నివేదిక ఇచ్చారని, ఆయన నాగంకు టికెట్‌ ఫైనల్‌ చేయలేదని చెప్పారు. తాను చెబితే దామోదర్‌రెడ్డి వింటారన్న ఆరోపణలను తనపై రాజకీయ కుట్రగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఎవరు తనను టార్గెట్‌ చేసినా భయపడి ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదన్నారు. కాంగ్రెస్‌ గెలుపు కోసం, రాహుల్‌ను ప్రధాని చేయడం కోసం నిబద్ధతతో పనిచేస్తానని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌లో ఎప్పుడూ గ్రూపులు లేవని, ఇప్పుడే వినిపిస్తున్నాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తాను నిరుత్సాహ పడనని, తనను నిరుత్సాహ పరిస్తే కాంగ్రెస్‌ పార్టీకే నష్టమని ఆమె వ్యాఖ్యానించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top