డింపుల్‌ యాదవ్‌ 30ఏళ్ల రికార్డు!

Dimple Yadav's 30-year old record - Sakshi

దేశంలో గత ముప్పయ్యేళ్లలో లోక్‌సభకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక మహిళ డింపుల్‌ యాదవ్‌. మొత్తం ఎన్నికల చరిత్రలో ఈ ఘనత సాధించిన 44వ వ్యక్తి కూడా ఆమే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అయిన డింపుల్‌ యాదవ్‌.. కనౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రుల పేర్లో లేదా కుటుంబ వారసత్వాన్నో ఉపయోగించుకుని రాజకీయాల్లో పైకొచ్చిన వాళ్లుంటారు. డింపుల్‌ యాదవ్‌ భర్త అఖిలేశ్‌ యాదవ్‌ యూపీ ముఖ్యమంత్రిగా చేశారు.

ఆమె మామ ములాయం సింగ్‌ యాదవ్‌ రాష్ట్ర రాజకీయ ప్రముఖుడు. అయితే, డింపుల్‌ వీరి సాయంతో రాజకీయాల్లో రాణించలేదు. తన సొంత ప్రతిభతో రాష్ట్రంలో, పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నా కంటే డింపుల్‌ ఎన్నికల సభలకే ఎక్కువ జనం వస్తార’ని స్వయంగా అఖిలేశ్‌ యాదవే అన్నారంటే ఆమె చరిష్మా ఎలాంటిదో అర్థమవుతుంది. 2012లో భర్త ఖాళీ చేసిన కనౌజ్‌ లోక్‌సభ స్థానంలో గెలవడంతో డింపుల్‌ రాజకీయ జైత్రయాత్ర మొదలైంది. కనౌజ్‌ నుంచి గెలిచిన అఖిలేశ్‌ యాదవ్‌ అసెంబ్లీకి వెళ్లడం కోసం ఆ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో డింపుల్‌ సహా ముగ్గురు పోటీ చేశారు. వారిలో ఒక ఇండిపెండెంట్, సంయుక్త సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

కాంగ్రెస్, బీజేపీ అసలు అభ్యర్థులనే పెట్టలేదు. దాంతో డింపుల్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. అంతకు ముందు 2009లో ఫిరోజాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా ఎన్నికల్లో అరంగేట్రం చేశారామె. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌బబ్బర్‌ చేతిలో ఓడిపోయారు. 2014లో మోదీ హవాలో యూపీలోని 80 లోక్‌సభ సీట్లలో ఎస్పీకి ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి. వాటిలో డింపుల్‌ పోటీ చేసిన కనౌజ్‌ ఒకటి. రాష్ట్ర ప్రజలు ‘బహు’, ‘భాభీ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే డింపుల్‌ రాజకీయంగా పరిణతి సాధించారు. కాగితంపై రాసుకుని ప్రసంగించే స్థాయి నుంచి సొంతంగా అనర్గళంగా ప్రసంగించే స్థాయికి ఎదిగారు. 2017 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ అయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top