మూడున్నర రోజుల ముఖ్యమంత్రి!

Devendra Fadnavis Records One Of The Shortest Stints As CM - Sakshi

    మహారాష్ట్రలో అత్యల్ప కాలం సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ రికార్డు 

    అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డూ ఫడ్నవిస్‌దే 

సాక్షి ముంబై: ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ వినూత్న రికార్డులు సాధించారు. వీటిలో ఒకటి అత్యధిక కాలం(ఐదేళ్లు) ముఖ్యమంత్రిగా కొనసాగడం మరొకటి అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం. రెండో సారి ఫడ్నవిస్‌ మూడున్నర రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ రెండు రికార్డులతోపాటు సుమారు 20 రోజులలోపాటు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరో రికార్డు కూడా సృష్టించారు.  మహారాష్ట్ర అవతరించిన అనంతరం ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. 

గతంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌ అయిదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. అనంతరం 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌ అయిదేళ్ల పాలన పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా రికార్డు సాధించారు. ఇలాంటి రికార్డు సృష్టించిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన అనంతరం మళ్లీ నవంబర్‌ 23వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

చదవండి: అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా

అయితే ప్రమాణస్వీకారం చేసి 80 గంటలు (మూడున్నర రోజులు)లోనే దేవేంద్ర ఫడ్నవిస్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి నేతగా దేవేంద్ర ఫడ్నవిస్‌ రికార్డు కెక్కారు. గతంలో 1963లో ముఖ్యమంత్రి మారోతరావ్‌ కన్నంవార్‌ మరణానంతరం 1963 నవంబరు 25వ తేదీ సావంత్‌ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాగా సావంత్‌ కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మరోసారి నవంబర్‌ నెలలోనే 23వ తేదీన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్‌ అత్యల్పంగా కేవలం మూడున్నర రోజులలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  

ఇద్దరిదీ ఒకే తీరు.. 
దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్‌ పవార్‌లు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. అయితే వీరిద్దరి జన్మదినం ఒకే రోజు కావడం విశేషం. దేవేంద్ర ఫడ్నవీస్‌ జన్మదినం 1970 జూలై 22 కాగా, అజిత్‌ పవార్‌ జన్మదినం 1959 జూలై 22. దీంతో ఒకే తేదీన జన్మించిన వీరిద్దరు 2019 నవంబర్‌ 23వ తేదీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా నవంబరు 26వ తేదీన ఇద్దరూ రాజీనామాలు చేయడం విశేషం.  

మహారాష్ట్రలో ఎప్పుడేం జరిగిందంటే.. 
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తరువాత రోజురోజుకు మారిన రాజకీయ పరిణామ క్రమం ఇలా..  

  •    అక్టోబర్‌ 21, 2019: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. 
  •    అక్టోబర్‌ 24: ఎన్నికల ఫలితాల ప్రకటన. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలు. 
  •    నవంబర్‌ 9: ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని  ఆహ్వానించిన గవర్నర్‌. మెజారిటీ నిరూపణకు 48 గంటల సమయం. 
  •    నవంబర్‌ 10: ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ప్రకటించిన బీజేపీ. శివసేనను ఆహ్వానించిన గవర్నర్‌. 
  •    నవంబర్‌ 11: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనన్న శివసేన. బల నిరూపణకు 3 రోజుల గడువు కోరింది. తిరస్కరించిన గవర్నర్‌. ఎన్సీపీకి ఆహ్వానం. 
  •    నవంబర్‌ 12: తమ వినతిని గవర్నర్‌ తిరస్కరించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన 
  •    నవంబర్‌ 22: శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్‌ ఠాక్రే 
  •    నవంబర్‌ 23: రాష్ట్రపతి పాలన ఎత్తివేత. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణం 
  •    నవంబర్‌ 23: గవర్నర్‌ నిర్ణయంపై మళ్లీ సుప్రీంను ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి 
  •    నవంబర్‌ 24: రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గవర్నర్‌ కోరిన లేఖను సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సుప్రీం ఆదేశం 
  •    నవంబర్‌ 26: నవంబర్‌ 27న బలనిరూపణ చేపట్టాలని గవర్నర్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు 
  •    అజిత్‌పవార్‌ రాజీనామా, దేవేంద్ర ఫడ్నవిస్‌ రాజీనామా. 
  •    నవంబర్‌ 27: మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top