కేసీఆర్‌ తీరుపై ప్రకృతి కూడా పగ పట్టింది: శ్రవణ్‌

Dasoju Sravan Kumar Fires On CM KCR - Sakshi

హుజూర్‌నగర్‌కు రావద్దనే ప్రకృతి ప్రకోపించింది..

ఇప్పటికైనా కేసీఆర్‌ నిరంకుశత్వాన్ని వీడాలి

ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌

సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం గురువారం బహిరంగసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటనకు ప్రకృతి కూడా అడ్డుపడిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ అన్నారు. కుండపోతగా వర్షం కురవడం ద్వారా దేవుడు హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ను రావద్దని ఆదేశించాడని వ్యాఖ్యానించారు. హుజూర్‌నగర్‌లో గురువారం శ్రవణ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్‌ తీరు పట్ల ప్రకృతి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉందని, నిరంకుశ విధానాలకు ప్రకృతి ప్రకోపించిందని, అందుకే హుజూర్‌నగర్‌ బహిరంగసభకు కేసీఆర్‌ హెలికాఫ్టర్‌ ద్వారా కూడా రాలేనంతగా ప్రకృతి శపించిందన్నారు. దీని ఫలితంగాకే కేసీఆర్‌ బహిరంగసభను రద్దు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. ఈ విధంగా దేవుడే వాతావరణం రూపంలో వచ్చి కేసీఆర్‌ను అడ్డుకున్నాడని వ్యాఖ్యానించారు. అసత్యాలతో చేయని వాటిని కూడా చేశామంటూ తప్పుడు హామీలు ఇచ్చేందుకు కేసీఆర్‌ వస్తున్నాడని తెలుసుకునే దేవుడు అతి భారీ వర్షం రూపంలో అడ్డుకున్నాడని అన్నారు. ప్రభుత్వ నిర్వాకాలకు వ్యతిరేకంగా ప్రజలే కాదు దేవుడు కూడా ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.

భారీ వర్షాల ద్వారా దేవుడు ఇక్కడి ప్రజల్ని రక్షించాడని, రెండు సార్లు భారీ వర్షం కురవడంతో ఇక్కడి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని, కేసీఆర్‌ను రానీయకుండా చేసిన వరుణదేవుడిన్ని జనం సైతం కొనియాడుతున్నారని దాసోజు శ్రవణ్‌  చెప్పారు.  ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ నియంతలా పాలన సాగిస్తున్నారని, నిరుద్యోగుల ఆశల్ని అడియాశలు చేశారని, అందుకే కేసీఆర్‌ను హుజూర్‌నగర్‌ రాకుండా కుండపోత వర్షం ద్వారా దేవుడు మోకాలడ్డాడని ఆయన నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశిస్తే.. తమకేమీ పట్టనట్లుగా కేసీఆర్‌ పాలన సాగుతోందని, ఇది కోర్టు ధిక్కారం అవుతుందని, కేసీఆర్‌ నియంత అని చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదని ఆయన విమర్శించారు. పని చేసిన కాలానికి జీతాలు ఇవ్వకుండా ఆరీస్టీ ఉద్యోగులను దసరా పండుగ సమయంలో ఇబ్బందులకు గురిచేసిన పాపం ఊరికేపోదని వ్యాఖ్యానించారు. కే సీఆర్‌ పతనానికి  ఇదే నాంధి అని, కేసీఆర్‌ పతనం ప్రారంభం అయిందని, ప్రజలు అన్నీ మరిచిపోయి ఎప్పుడూ తమ వెంటే ఉంటారని భావించవద్దని హెచ్చరించారు. ప్రజల నుంచి గుణపాఠం కేసీఆర్‌కు ఉంటుదని శాపాలు పెట్టారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top